Two People Killed for Deleting Photos on WhatsApp : వాట్సాప్‌లో ఫొటోలు తొలగించారనే నెపంతో పాటు వ్యక్తిగత కక్షల కారణంగా ఇద్దరు యువకులను హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఓ విల్లాలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. కడ్తాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులు నిందితులను అరెస్టు చేయాలంటూ హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన శేషుగారి శివగౌడ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు గుండెమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఒక చికెన్ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారు అప్పుడప్పుడు స్వగ్రామానికి వెళ్లేవారు. అయితే వీరిద్దరికి అదే గ్రామానికి చెందిన బీజేపీ నేత జల్కం రవి సహా కొందరితో వ్యక్తిగత విభేదాలుండేవి. జల్కం రవి స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. ఆయన వ్యాపారం కోసం కడ్తాల్‌లోని బటర్ ఫ్లై సిటీలో ఓ విల్లాను అద్దెకు తీసుకున్నాడు.
ఈ క్రమంలో జూన్ 4వ తేదీన రవి పుట్టినరోజు కావడంతో స్థానిక బీజేపీ నాయకులు, మిత్రులతో కలిసి విల్లాలోనే వేడుకలు చేసుకున్నారు. వేడుకల్లో దిగిన ఫొటోలను, పేర్లను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఇదే గ్రూపునకు అడ్మిన్‌గా ఉన్న శేషుగారి శివగౌడు, గుండెమోని శివగౌడు ఆ ఫొటోలను డిలీట్ చేశారు. అప్పటికే వీరితో కక్ష పెంచుకున్న జల్కం రవి ఇద్దరు శివలు తమ ఫొటోలు డిలీడ్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా వారిని చంపాలని సన్నిహితులతో కలిసి ప్లాన్ వేశాడు. ఈ పథకంలో భాగంగా వారిద్దరిని హైదరాబాద్ నుంచి బుధవారం కడ్తాల్‌లోని విల్లాకు రప్పించాడు.