Chemical Fertilizers Usage More in Crop Cultivation : తెలంగాణలో పంటలకు ఎరువులు, పురుగు మందుల పిచికారీ వినియోగం ఏటికేడు పెరుగుతోంది. గత ఏడాది 44 లక్షల టన్నులు వినియోగమవగా, ఈ సంవత్సరం మరో 3 లక్షల టన్నులు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా గత 5 నెలల కాలంలోనే 14.85 లక్షల టన్నుల ఎరువులు వినియోగమైంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర సర్కారులు కోరుతున్నా, రైతులు మాత్రం వాటికే మొగ్గు చూపుతున్నారు.
జాతీయ సగటు కంటే ఎక్కువ : ప్రపంచవ్యాప్తంగా ఎకరా పంటకు సగటున 78.4 కిలోల ఎరువు వినియోగిస్తున్నారు. కానీ మన దేశంలో 51.2 కిలోలుగా ఉంది. తెలంగాణలో మాత్రం దాదాపు 130 కిలోలు వాడుతున్నారు. రాష్ట్రంలో 2014-15లో 15.12 లక్షల టన్నులుగా ఉన్న సరఫరా, 2024-25 నాటికి 47.18 లక్షల టన్నులకు ఎగబాకింది. వరికి ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాశ్ వంటి ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా 9.5:2.7:1 నిష్పత్తిలో వాడుతున్నారని తేలింది.
ఎరువులకే అగ్రతాంబూలం :రైతులు ప్రతి సీజన్‌లో విత్తనాల కంటే ముందే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. వరి ఏపుగా పెరగాలనే ఆశతో రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. యూరియా వేస్తే పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందనే ఆలోచన అన్నదాతల్లో బాగా ఉంది. అందువల్లే దీని వినియోగం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. యూరియా 2015-16లో 12.53 లక్షల టన్నులు వినియోగమవగా, ఈ ఏడాది 21 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Increased Fertilizers Usage in TG :భూసార పరీక్షల్లో ఆయా ప్రాంతాల్లోని నేలల్లో అవసరానికి మించి భాస్వరం నిక్షిప్తమై ఉంది. ఇది ఎక్కువగా ఉంటే డీఏపీ ఎరువును పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. అయినా రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి ఏటా 5 లక్షల టన్నుల దాకా విచ్చలవిడిగా చల్లుతున్నారు. నత్రజని, పొటాశ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటివల్ల అక్కడ సాగునీరు, నేల మాత్రమే కాకుండా పర్యావరణంలోకి సైతం కాలుష్యం విడుదలై అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.