FedEx Scams Increase In Hyderabad : దొంగతనం అంటే తాళం పగులగొట్టాల్సిన అవసరం లేదు. కిటికీఊచలూ తొలగించనక్కర్లేదు. ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. అయనా వారి ఆగడాలు ఆగడం లేదు. ఎలాంటి పార్శిల్ పంపకున్నా అందులో నిషేధిత పధార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్‌కు పంపిన కొరియర్‌లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్‌తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది.
ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్థులు వీడియో కాల్‌చేసి 6 గంటలపాటు పోలీస్‌ల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని కాదంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని రూ.24.58 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వృద్ధుడి వద్ద 2.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు :మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు. ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ ఉంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుడిని నమ్మించి రూ.2,33,794లను కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని రూ.7.11 లక్షలను కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజు నిత్యకృత్యంగా మారిపోయాయి.