Guru Nanak Jayanti 2024 : హిందువులకు కార్తిక పౌర్ణమి పరమ పవిత్రమైన పర్వదినం. అదే రోజు గురు నానక్ జయంతి కూడా జరుపుకోవడం విశేషం. గురునానక్ జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఘనంగా జరుపుకుంటారు. గురు నానక్ జయంతిని 'గురు పురబ్' లేదా 'ప్రకాశ్ పర్వ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గురు నానక్ జయంతి నవంబర్ 15వ తేదీ శుక్రవారం జరుపుకుంటున్నాం.
ఆది గురువు
సిక్కు సమాజంలో మొత్తం 10 గురువులు ఉన్నారు. వీరందరిలో మొట్టమొదటి గురువు గురునానక్. సిక్కు మతాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన గురునానక్ 1469లో కార్తిక పౌర్ణమి రోజున జన్మించారు.
అపారమైన జ్ఞాన సంపద
గురు నానక్ హిందూ, ఇస్లాం మతాల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఈ జ్ఞానంతోనే 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ బోధనలు సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో భద్రపరిచి ఉంచారు.
వివిధ సూత్రాలతో కూడిన గురునానక్ బోధనలు
గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత, నిస్వార్థ సేవ, ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలు ఉన్నాయి. గురునానక్ బోధనల ప్రకారం విశ్వానికి సృష్టికర్త ఒక్కరే అని తెలుస్తోంది. గురునానక్ బోధనలు కులమత భేదాలతో సంబంధం లేకుండా అందరికీ మానవత్వం, శ్రేయస్సు, సామాజిక న్యాయం కోసం నిస్వార్థ సేవను ప్రచారం చేస్తాయి.
పునర్జన్మ భావనలు నిషేధం
భారత దేశంలో కొన్ని మతాలు పునర్జన్మను విశ్వసిస్తే సిక్కు మతం మాత్రం పునర్జన్మ భావనలను నిషేధిస్తుంది.
గురు నానక్ జయంతి వేడుకలు ఇలా!
ప్రపంచవ్యాప్తం ఉండే గురుద్వారాలలో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక పంజాబ్ రాష్ట్రంలోని గురుద్వార్ లో గురు నానక్ జయంతికి రెండు రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. గురుద్వారాస్ లో అఖండ మార్గంగా పిలువబడే గురు గ్రంథ్ సాహిబ్ గురించి 48 గంటల పాటు నిరంతరాయంగా పఠనం జరుగుతుంది.
పంజ్ ప్యారే
గురునానక్ జయంతికి ఒకరోజు ముందు నాగర్ కీర్తన జరుగుతుంది. దీనిని పంజ్ ప్యారే అని పిలుస్తారు. సిక్కులకు సంబంధించి త్రిభుజాకార జెండా, నిషాన్ సాహిబ్, నాగర్ కీర్తన సమయంలో సిక్కు మతం యొక్క పవిత్ర మత గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పల్లకీలో ఉంచుతారు. ఆ తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు.
మూడు సూత్రాలతో మార్గదర్శకత్వం
సిక్కు మతంలో గురునానక్ ప్రబోధించిన మూడు మార్గదర్శక సూత్రాలున్నాయి. అందులో మొదటిది 'నామ్ జపన' అంటే ఎల్లప్పుడూ దేవుడిని స్మరించుకోవడం, రెండు 'కిరాత్ కర్ణ' అంటే ఎలాంటి స్వార్ధం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం, 'మూడవది వంద్ చకనా' అంటే మనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం.
నిజానికి ఎంత గొప్పవో కదా ఈ సూత్రాలు! కార్తిక మాసంలో హిందువులు కూడా నామ స్మరణ, దానం వంటి విశేష గుణాలతో మోక్షాన్ని పొందుతారని అంటారు కదా! ఏ మతమైనా భగవంతుడు ఒక్కడే! బోధనలు సమానమే! అవి అర్ధం చేసుకొని ఆచరణలో పెడితే భారతదేశం వసుధైక కుటుంబం అవుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు! లోకా సమస్తా సుఖినో భవంతు!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.