Cases Filed on Actors Posani and Sri Reddy : సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళి, మరో సినీ నటి శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీసు స్టేషన్లలో వరుస కేసులు నమోదయ్యాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోసానిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొండ టీడీపీ నేతలు బొగాది వెంకటరమణ, అనాపు జవరాజు, కూటమి కార్యకర్తలు ఎస్సైకి కంప్లైంట్ అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ను అభ్యంతకర పదజాలంతో దూషించిన పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్లోనూ పోసాని కృష్ణమురళిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌పై అనుచిత వాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు కంప్లైంట్లో పేర్కొన్నారు.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి సైతం ఠాణాలో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర టీడీపీ నాయకులపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోసానిపై పాతపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేసి, తగు చర్యలకు ఉపక్రమించాలని ఆయన కోరారు.
Cases Registered On Sri Reddy : మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. నిర్మల కంప్లైంట్ మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి అనకాపల్లి పట్టణ ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కల్యాణ్, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.
విశాఖ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లోనూ శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది. శ్రీ రెడ్డిపై విశాఖ సౌత్ నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలపై వివిధ పోస్టులతో పాటు అనుచితంగా వాఖ్యలు చేస్తూ, యూట్యూబ్‌లో వీడియో చేసిన శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
రామ్‌గోపాల్ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు
'తప్పయింది - క్షమించండి - నేను పూర్తిగా మారిపోయాను' : కాళ్లబేరానికి వచ్చిన నటి