Young Man Brutally Murder :సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురైన లారీ డ్రైవర్ ఆంగోత్ దశరథ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువతి తండ్రి గోపాల్ దశరథ్ను దారుణంగా హతమార్చాడు. ముందుగా దశరథ్ను బండరాయితో అంతమొందించి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలోని నాగధర్రాంచందర్ తండాకు చెందిన ఆంగోత్ దశరథ్ కొన్నేళ్లుగా సంగారెడ్డిలోని గణేశ్ షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు స్వస్థలంలోనే నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం లారీ యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపై దశరథ్ స్వగ్రామానికని బయలుదేరాడు. కానీ స్వగ్రామానికి చేరుకోలేదు. అలాగని పని చేసే చోటా లేడు. దీంతో ఆయన భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దశరథ్ భార్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు శుక్రవారం అదృశ్యం కేసు నమోదు చేశారు. శనివారం నిజాంపేట్ మండలంలోని మెగ్యానాయక్ తండాకు చెందిన గోపాల్ తానే దశరథ్ను హత్య చేశానని ఖేడ్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతున్నట్లు సమాచారం.
కుమార్తెతోనే ఫోన్ చేయించి :దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. దశరథ్కు గోపాల్ తన కుమార్తెతోనే ఫోన్ చేయించి ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దశరథ్ వచ్చిన వెంటనే గోపాల్‌తో పాటు మరో వ్యక్తి అతనితో వాగ్వాదానికి దిగారు. కొంత తోపులాట జరిగింది. దశరథ్కు ఇదివరకే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మళ్లీ తన కుమార్తె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావ్ అంటూ గోపాల్ దశరథ్ను పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్నట్లు సమాచారం. దశరథ్ బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లి ఆమెను కలవడం, ఎక్కువసేపు మాట్లాడటం వంటి విషయాలను గుర్తించిన పాఠశాల యాజమాన్యం, బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పక్కా ప్రణాళికతో దశరథ్ను రప్పించి అతనిని హత్య చేసినట్లు సమాచారం.