Murder Case in Medchal District : ఈనెల 16న మేడ్చల్ జాతీయ రహదారి-44పై పట్టపగలు అన్నను తమ్ముడు చంపిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు.
నిందితుడి అరెస్ట్ : బస్టాప్ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి సుమారు 10-15 కత్తితో పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని పక్కనే ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని కుమారుడు సాయి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణాలు కూడా మొగిలి హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించారు.
సీసీటీవీలో రికార్డు : మృతిచెందిన వ్యక్తిని సికింద్రాబాద్ లాలా పేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్ అని తెలిపారు. సాయి కుమార్ కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.