Father And Son Died in Road accident : ఇంట్లో ఉన్న పిల్లలు ఊరెళ్లిన తల్లిదండ్రులు వస్తారని గుమ్మం ఎదుట నిలబడి చూస్తున్నారు. కొన్ని నిమిషాల్లో తల్లిదండ్రలు ఇంటికి చేరతారు. అంతలోనే వారిని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్జు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పండుగ పూట ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకోవడంతో వారి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం గురించి తెలియని పిల్లలు తల్లిదండ్రులు వస్తారని ఎదురు చూస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం: గోదావరిఖనిలోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన గిన్నారపు సతీష్ (32) సింగరేణి జీడీకే -11 గనిలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమీప బంధువుకు కుమారుడు పుట్టడంతో అందరూ కలిసి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కుమార్తె, రెండో కుమారుడిని ఇంటి వద్దే ఉంచి భార్య కీర్తి, 11 నెలల కుమారుడు నవీశ్, సోదరి అనూష, ఆమె భర్త ఆత్మకూరి సతీష్‌లతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని మళ్లీ అదే రోజు రాత్రి 11 గంటలకు బయలుదేరారు.
మరణించిన తండ్రీకుమారులు : తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోదావరిఖనికి చేరుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న గిన్నారపు సతీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నవీశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కీర్తి, అనూష, సతీష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.