అకాల వర్షం, అపార నష్టం - ప్రభుత్వంపైనే రైతన్నల చూపులు Crop Damage in Telangana : అకాల వర్షాల రూపంలో అన్నదాతలపై మరో పిడుగు పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి వరదపాలైంది. భారీ ఈదురు గాలులతో కుండపోతగా కురుసిన వానకు ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. మార్కెటింగ్ అధికారులు రైతులకు టార్ఫాలిన్లు ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది : తుమ్మల నాగేశ్వర్రావు - Minister Tummala Review Meeting
Crop Loss due to Heavy Rains :హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో మండలాల్లో వర్షం ధాటికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లను కాపాడుకునేందుకు సాగుదారులు నానా కష్టాలు పడ్డారు. అధికారులు జాప్యం చేయకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాజీపేట, ధర్మసాగర్, వేలేరు, కమలాపూర్ మండలాల్లో, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్, తరిగొప్పుల మండలాల్లో వరుణుడి ప్రతాపానికి మామిడి కాత నేలరాలింది.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని మండలాల్లో జడివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పంట పండించినప్పటికీ, తీరా నోటికాడి వచ్చే సమయంలో కన్నీళ్లు మిగిలాయని గోడు వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, ఇందల్వాయి మండల్లాలో గాలివానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులు టార్ఫాలిన్లు కప్పినప్పటికీ, గాలి ధాటికి అవి కొట్టుకుపోయాయి. ఫలితంగా ధాన్యం రాశులు, బస్తాలు వరద నీటిలో నానుతున్నాయి.
కేంద్రాల నిర్వాహకులు సకాలంలో స్పందించక పోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎన్నికల విధులతో తమ బాధలు చూసే పరిస్ధితి లేదని వాపోయారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్లు తడిచాయి. సరైన వసతులు లేకపోవడం వల్లే నష్టపోయామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారం నుంచి ఠారెత్తించిన ఎండలు, ఉక్కపోతకు అల్లాడిన భాగ్యనగరవాసులు తాజాగా పడ్డ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. జంటనగరాల్లోని చాలా ప్రాంతాల్లో వరుణుడి చిరుజల్లులతో వాతావరణం చల్లపడింది. రాజేంద్రనగర్ పరిధి బాబుల్‌రెడ్డినగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్టపైనా వరుణుడు కరుణ చూపాడు. ఇన్నాళ్లు ఎండకు అల్లాడిన భక్తులు జల్లులకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
"అకాల వర్షాలతో మా ధాన్యమంతా కొట్టుకుపోయింది. మార్కెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తడిచిపోయింది. తూకం వేసినరోజు తేమ పేరుతో పెద్ద మొత్తంలో కట్టింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యనంతా కొనుగోలు చేయాలి". - రైతులు
తెలంగాణకు అలర్ట్ - మూడు రోజులు కూల్ హ్యాపీస్! - Telangana Rain Alert
రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Telangana