Britain New King And Queen : బ్రిటన్ రాజు మూడో ఛార్లెస్ తన కుమారుడిని, కోడల్ని రాజు, రాణిగా పట్టాభిషేకం చేయించనున్నారా? రాజు ఇటీవల తన కోడలు కేట్ మిడిల్టన్‌తో సమావేశాన్ని నిర్వహించడం అదే అంతరంగాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. రాకుమారుడు విలియం ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ రాజు-రాణిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ముందుగానే సిద్ధమవుతున్నట్లు కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి.
విలియం రాజుగా సింహాసనాన్ని అధిష్టించే విషయంలో రాజ కుటుంబంలో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాన్సర్ బారినపడిన ఛార్లెస్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన పదవీ పరిత్యాగంపై ప్రచారం మరింత ఊపందుకుంది. మార్చిలో నిర్వహించిన ఓ సమావేశంలో కేట్ మిడిల్టన్ మాట్లాడుతూ తాను కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో మామ, కోడలికి పరస్పర అనుబంధం బలపడిందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేట్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు.
విలియం సిద్ధం!
మరోవైపు విలియం రాజ కిరీటాన్ని ధరించేందుకు సిద్ధమవుతున్నారని రాయల్ బయోగ్రాఫర్ బెడెల్ స్మిత్ చెప్పినట్లుగా పీపుల్ పత్రిక ఇటీవల ఓ కథనం వెలువడింది. "ప్రస్తుతం రాజు తన విధులను నిర్వహిస్తున్నప్పటికీ.. క్యాన్సర్ చికిత్స కారణంగా ఆయన కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వస్తోంది. దాంతో యువరాజు విలియంపై మరిన్ని అదనపు బాధ్యతలు పడ్డాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ఊహించిన దానికంటే ముందుగానే విలియం-కేట్ బ్రిటన్ రాజు-రాణిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి వారు కూడా ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు"’ అని స్మిత్ తెలిపారు.
రాణి ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కుమారుడు మూడవ ఛార్లెస్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 76 ఏళ్ల ఛార్లెస్ ఈ మధ్య తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటుండటంతో ఆయన ఆరోగ్యంపై రాజకుటుంబంలో ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో వీలైనంత త్వరగా విలియంను రాజుగా ప్రకటించడానికి వారు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.