Farmers Struggling for Seeds Shortage in Telangana :ఏటికేడు అన్నదాతకు సవాళ్ల సాగు తప్పట్లేదు. నీటి ఎద్దడి, అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిరీక్షణ రైతన్నలను వరుసగా వేధించాయి. గత కష్టాలను దిగమింగి మరోమారు సాగుకు సన్నద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. పచ్చిరొట్ట పైర్లు భూసారాన్ని పెంచి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. అధికారుల నిర్లక్ష్యంతో జనుము, జీలుగ విత్తనాల కోసం అన్నదాతలకు అరిగోసలు తప్పట్లేదు. తినీ తినకా పొద్దస్తమానం లైన్లలో నిలుచున్నా దొరుకుతాయో లేదో అన్నది దైవాధీనంగానే మారుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో లేక హలధారి ఆందోళనకు దిగుతున్నాడు. పోలీసులు నియంత్రించే క్రమంలో తోపులాట జరిగి గాయాల పాలవుతున్నారు. మెదక్ జిల్లా మిరుదొడ్డిలో రైతులు గంటల తరబడి ఎండలోనే బారులు తీరారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పత్తి విత్తనాల కోసం అన్నదాతలు పాసుపుస్తకాలు లైన్లలో పెట్టి వేచి చూశారు. అధికారులు స్పందించి జనుము, జీలుగ విత్తనాల కొరత లేకుండా చూడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు కోరారు.
రెండు, మూడు రోజులు ఆగితే ఇబ్బంది ఉండదు : జనుము, జీలుగ విత్తనాల కొరత తీర్చేందుకు విత్తన కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సరిపడా నిల్వలు వస్తే ఇబ్బందులు తప్పుతాయని వెల్లడిస్తున్నారు. క్యూలైన్లో నిల్చుని ఉన్న ప్రతి రైతుకు రెండు ప్యాకెట్లు విత్తనాలు ఇస్తున్నామని తెలిపారు.