తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై ఎగ్మోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ఇటీవల పోయెస్ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్టు చేశారు. ఆమెను చెన్నైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.