Karthika Puranam Chapter 16 : సకల పాపహరణం కార్తిక పురాణ శ్రవణం. పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిత్య పారాయణగా చెప్పుకుంటున్న కార్తిక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో 'స్తంభ దీపం మహత్యం' గురించి వివరించిన సంగతులను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్తిక మాసంలో ఈ దానాలు శ్రేష్ఠం
వశిష్ఠుడు జనకునితో 16వ రోజు కథను ప్రారంభిస్తూ ఈ విధముగా చెప్పసాగెను. "ఓ రాజా! కార్తిక మాసమున స్నానదాన జపములు చేయుట, సాలగ్రామ దానం చేయుట ఎంతో ముఖ్యం. ఎవరు శక్తి ఉండి కూడా దానాలు చేయరో, అట్టివారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు. ఎవరైతే కార్తిక మాసమున నెల రోజుల పాటు తాంబూల దానం చేస్తారో వారు మరుసటి జన్మలో చక్రవర్తులుగా పుడతారు. కార్తిక మాసంలో దీపారాధనకు ఉన్న గొప్పతనం అంతా ఇంతా కాదు. మరొక ముఖ్య విషయమేమిటంటే కార్తిక పౌర్ణమి రోజున దేవాలయంలో స్తంభ దీపం పెట్టిన వారికి సకల ఐశ్వర్యములు కలుగును. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టని వారు మరుజన్మలో చుంచు జన్మ ఎత్తుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథను చెబుతాను వినుము" అని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.
స్తంభ దీప మహత్యం
ఋషులలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన మాతంగి మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకుని, దానికి దగ్గరగా ఒక విష్ణువు మందిరాన్ని కూడా నిర్మించి ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తిక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుండేవారు. వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపాలను పెట్టి, భక్తితో శ్రీహరిని సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు ఆ మునులలో కెల్లా వృద్ధుడు ఒకరు తక్కిన మునులను చూసి,"ఓ సిద్దులారా! రేపు కార్తిక పౌర్ణమి. కావున మనము హరిహరాదుల ప్రీతి కోసం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని నాటి, దానిపై దీపాన్ని పెడదాం. కావున మనము వెంటనే అడవికి వెళ్లి ఒక నిటారైనా స్తంభాన్ని తీసుకుని వద్దాం పదండి" అని చెప్పగా అందరూ పరమానందంతో అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక నిటారైన చెట్టును మొదలంటా నరికి తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా నాటి దానిపై ధాన్యం పోసి, ఆవునేతితో నిండిన పాత్రను దానిపై ఉంచి, అందులో వత్తి వేసి దీపం వెలిగించి, కార్తిక పురాణ పఠనం చేయడం ప్రారంభించారు. ఇంతలో ఫెళ్ళున శబ్దంతో ఆ స్తంభం విరిగి ముక్కలై కిందపడి, దానిపై ఉంచిన దీపం కూడా కింద చెల్లాచెదురుగా పడిపోయెను. మునులు ఆ శబ్దమునకు ఆశ్చర్యముతో అటువైపు చూడగా ఆ స్తంభం నుండి ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ మునులు అతనిని చూసి "ఓయీ! నీవెవరు? ఈ స్తంభం నుంచి బయటకు ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి? అని ప్రశ్నించగా, ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ధనం ఉండి కూడా ఐశ్వర్య గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని. ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చినప్పుడు అతనిని నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు అతని నెత్తి మీద చల్లుకోమని అహంకారంతో చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని. దానధర్మములు చేయకుండా, పాపినై అవసానదశలో చనిపోయిన తరువాత ఎన్నో జన్మలలో కుక్కగా, కాకిగా, తొండగా జన్మించి, చివరికి చెట్టుగా అడవిలో పడి ఉన్న నేను మీ దయ వలన స్తంభముగా మారి కార్తిక పౌర్ణమి రోజున భగవంతుని దీపారాధనకు ఉపయోగపడిన పుణ్యానికి నేటితో నా పాపం నశించి పోయి నర జన్మనెత్తి జ్ఞానిని అయ్యాను" అని చెప్పగా ఆ మునులు ఆశ్చర్యముతో "ఆహా! కార్తిక మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమికి ఎంతటి మహిమ కలదు. ఆఖరికి చెట్లు, స్తంభాలు కూడా ముక్తిని పొందుతున్నాయి. మరి కార్తిక పౌర్ణమికి ఆకాశదీపం ఉంచిన మానవుడికి ఎంతటి మోక్షం కలుగునో కదా"అని చర్చించుకొంటుండగా విన్న ఆ పురుషుడు, స్వామి! నాకు కర్మబంధము నుంచి విముక్తి ఎట్లు కలుగును? నా సందేహం తీర్చండి" అని ప్రార్థించగా, ఆ మునులలో ఒకడైన అంగీరసుడు అతని సందేహం తీర్చడానికి ఇలా చెప్పసాగెను" అంటూ వశిష్ఠులవారు రేపటి రోజున ఈ వృత్తాంతం తెలుసుకుందామంటూ పదహారవ రోజు కథను ముగించారు.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.