తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం కంటే అధికంగా మద్దతు ధరలు - ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్న రైతన్నలు - Farmers Selling Crops To Private - FARMERS SELLING CROPS TO PRIVATE

Farmers Interest in Private Markets for Selling Crops : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండటంతో వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతోంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Mahabubnagar Market
Farmers Interest in Private Markets for Selling Crops in Mahabubnagar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 12:54 PM IST

Farmers Interest in Private Markets for Selling Crops in Mahabubnagar :ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం రాక కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. పాలమూరు జిల్లాలో మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి ఈ యాసంగి సీజన్​లో 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 800కు పైగా కొనుగోలు కేంద్రాలను సైతం తెరిచింది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.

ఈసారి ఉమ్మడి జిల్లాలో సన్నరకమే అధికంగా పండించగా, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల రైతులు అధికంగా కర్ణాటక, రాయచూరు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్మారు. మిగిలిన చోట్ల మధ్య దళారులు, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ.2,200 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్​లో గరిష్ఠంగా రూ.2,700 వరకూ కొనుగోలు చేయడంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు.

"గతేడాది కంటే ఈసారి మార్కెట్​కు అధికంగా వడ్లు వచ్చాయి. దాదాపు ఈ సంవత్సరం రెండు లక్షలకు పైగా వరి ధాన్యం మార్కెట్​కు వచ్చింది. వరి ధర కూడా బాగానే పలుకుతుంది. రైతులు కూడా కోతలు కోసి డైరెక్ట్​గా మార్కెట్​కే తీసుకువస్తున్నారు. వాళ్లకు ఎండ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పచ్చిగా ఉంటే మార్కెట్​ షెడ్లల్లో ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్నారు." -విజయ్‌చందర్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి

ప్రైవేటు మార్కెట్లకే మొగ్గు చూపుతున్న రైతన్నలు ప్రభుత్వం కంటే అధికంగా మద్దతు ధర (ETV Bharat)

నత్తతో పోటీ పడుతోన్న ధాన్యం కొనుగోళ్లు - కాపలా కాయలేక అవస్థలు పడుతున్న అన్నదాతలు - Paddy Procurement Slows Down

మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, బాదేపల్లి, దేవరకద్ర, నవాబు పేట, బాలనగర్ వ్యవసాయ మార్కెట్లున్నాయి. గతేడాది, ఈ సమయానికి తెలంగాణ సోనా రకం లక్షా 13వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది లక్షా 94వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఒక్క బాదేపల్లి మార్కెట్​లోనే గతేడాది 33వేల క్వింటాళ్ల ధాన్యం కొంటే ఈ ఏడాది యాసంగి సీజన్​లో సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నవాబుపేట మార్కెట్‌లో గతేడాది యాసంగిలో సోనా రకం 500 క్వింటాళ్ల కొనుగోళ్లు సాగితే, ఈ ఏడాది 17వేల క్వింటాళ్లు కొన్నారు. హంస రకాలు మాత్రం పోయిన ఏడాది 27వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఈసారి 4వేల క్వింటాళ్లే వచ్చాయి. కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండటంతో రైతులు మార్కెట్లకు వస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి : రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Review Meeting

దీనికి తోడు తేమ శాతంతో సంబంధం లేకుండా కోసుకొచ్చిన ధాన్యాన్ని నేరుగా అమ్మినా, వ్యాపారులు మంచి ధర ఇవ్వడంతో రైతులు మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం బాదేపల్లి, మహబూబ్​నగర్ మార్కెట్లకు ఇంకా ధాన్యం రాక కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకూ ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు కురుస్తుండంతో ఎంతో కొంతకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్లకు మరో 15రోజుల వరకూ ధాన్యం రాక కొనసాగనున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా మార్కెట్‌లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. వాన రాకను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనగోలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం తూకంలో అవకతవకలు - కాంటాలో కిలో తేడా వస్తోందని రైతుల ఆందోళనలు - PADDY PROCUREMENT CHEATING IN TS

ABOUT THE AUTHOR

...view details