Huge Loss Over Rain in Telangana : భానుడి భగభగలతో అతలాకుతలమవుతున్న తరుణంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వడగండ్లు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి.
మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలోనే భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురుగాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో సీఎం సభ రద్దు చేశారు.
వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన ధాన్యం : కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. హుస్నాబాద్, వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్‌తో పాటు హుజురాబాద్‌లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొట్టుకుపోయింది.
వరంగల్ తిమ్మాపూర్‌లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈదురు గాలులకు సభావేదిక కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురు చూస్తున్న రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి.
కోతకొచ్చిన పంట నష్టం - నేలరాలిన మామిడికాయలు : వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండటంతో కొంత మేరకు ధాన్యం కొట్టుకుపోయింది. రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం పడింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలుల తాకిడికి మామిడికాయలు రాలిపోయాయి. కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఉరుములు- మెరుపులతో కూడిన వాన కురిసింది.
రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు - రైతులతో పాటు నేతలను సైతం కలవరపెట్టిన వాన బీభత్సం (ETV Bharat) ఈదురు గాలుల బీభత్సం - పలు జిల్లాల్లో నేలకొరిగిన ఉద్యాన పంటలు - Untimely Rains in Telangana 2024
రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరిక - 4 రోజులపాటు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Report