Nephrologist Prabhakar Sharma On Artificial kidneys: రక్త పోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులతో పాటు కిడ్నీ బాధితుల సంఖ్య మన దేశంలో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం చిన్న పట్టణాల్లో సైతం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అమెరికాలో ప్రయోగ దశలో ఉన్న 'ఐఆర్ఏడీ' పరికరంతో భవిష్యత్తులో డయాలసిస్ అవసరం లేదని నెఫ్రాలజిస్టు డాక్టర్ ప్రభాకర్ ఎస్.శర్మ చెప్పారు. అమెరికా టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్లో వైస్ ఛైర్మన్‌గా పని చేస్తున్న ఆయన, కిడ్నీ వ్యాధులపై లోతైన పరిశోధనలు చేసిన అంతర్జాతీయ జర్నళ్లలో వందకు పైగా పరిశోధన పత్రాలు రాశారు. హైదరాబాద్‌లోని ఏఐజీలో జరుగుతున్న ఐఎంఏ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు.
కిడ్నీ వ్యాధుల అధ్యయనంపై అమెరికా ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. 'ముఖ్యంగా టెక్సాస్‌లో భారీ సంఖ్యలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఉంటారు. అక్కడ 2 వేల మంది సాధారణ ప్రజలను అధ్యయనం చేయగా, వారిలో 17 శాతం మందిలో కిడ్నీ సమస్య ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమస్యలు ఉన్నట్లు అక్కడ చాలా మందికి తెలీదు. మన భారత్‌లో కూడా చాలా మంది ప్రజలకు కిడ్నీ సమస్య ఉందని తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి రక్త, మూత్ర పరీక్షలు చేసుకోవాలి. ఒకవేళ సమస్య ఉన్నట్లైతే చికిత్స సాధ్యమవుతుంది.
అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బయో ఇంజినీర్డ్ ఆర్గాన్స్ తయారు చేసే ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఇది జంతువులపై ప్రయోగ దశలో ఉంది. ఇందులో కిడ్నీలతో పాటు, గుండె, కాలేయం లాంటి అవయవాలకు కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పరిశోధన పత్రాన్ని నేను సమీక్షించా'నని డాక్టర్ చెప్పారు. దీంతోపాటు కాలిఫోర్నియాలో ఇంప్లాంటబుల్ రీనల్ అసిస్ట్ డివైజ్ ఐఆర్ఏడీను అభివృద్ధి చేస్తున్నారని, ఈ పరికరాన్ని కడుపులో అమరిస్తే కిడ్నీ చేసే పని ఇది చేస్తుందని వివరించారు. ఇది ఇంకా ట్రయల్ దశలోనే ఉందని, ఐఆర్ఏడీ అందుబాటులోకి వస్తే డయాలసిస్‌తో పని ఉండదన్నారు.
'కిడ్నీ సమస్య ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి. రోజుకు అరగంట వేగంగా నడక, జాగింగ్, ఈత చేయాలి. వీటి వల్ల కిడ్నీ సమస్యలు రావు. మంచి నీరు రోజుకు 2 నుంచి 4 లీటర్ల వరకు తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ టీతో పాటు పసుపు చాలా మంచిదని అధ్యయనంలో తేలింది.'