తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా దోచేసి బతికేస్తున్నారు - ఈ 'కుటుంబ నేరకథా చిత్రమ్‌' గురించి మీరూ తెలుసుకోవాల్సిందే? - FAMILY ROBBERIES IN TELANGANA - FAMILY ROBBERIES IN TELANGANA

Family Robberies in Hyderabad : విలాస జీవితం గడిపేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. విహారయాత్రలు, మత్తు అలవాట్లు, లగ్జరీ నివాసాలు, ఖరీదైన కార్లలో తిరగాలనే మోజుతో దోపిడీలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

FAMILY ROBBERIES IN TELANGANA
FAMILY ROBBERIES IN TELANGANA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 1:02 PM IST

Family robberies in Telangana :ఆమె స్టేట్‌ కో-ఆపరేటివ్‌ జనరల్‌ మేనేజర్‌. బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఖాతాదారులను తప్పుదారి పట్టించారు. తన భర్త, కుమారుడు ప్రారంభించిన ఫైనాన్స్‌ సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని వందలాది మందితో డబ్బులు కట్టించారు. అలా రూ.200 కోట్లు ఫైనాన్స్ సంస్థలోకి మళ్లించి మోసం చేసిన ఘటన, ఈ వార్త ఆ మధ్యకాలంలో సంచలనం సృష్టించింది. ఆమె కాదు ఆమెలా అనేక మంది, ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకోని మోసం చేస్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.

ఏదైనా ఇంట్లో ఒకరిద్దరు తప్పటడుగులు వేస్తారు. విలాస జీవితం గడిపేందుకు నేరాల బాట పట్టడం గమనిస్తుంటాం. హైదరాబాద్ నగరంలో తాజాగా నమోదవుతున్న పోలీసు కేసుల్లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటిల్లిపాదీ ఆర్ధిక మోసాలు, డ్రగ్స్‌ దందాల్లో పాలుపంచుకుంటున్న సంగతులు దర్యాప్తులో బయటపడటం పోలీసులనూ విస్మయానికి గురిచేస్తోంది.

వీరిలో అధికశాతం లగ్జరీ నివాసాలు, ఖరీదైన కార్లలో తిరగాలనే మోజుతో తెగిస్తున్నారు. గత కొంత కాలంగా నగరంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కలిసి మోసం చేస్తున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఈ కేసుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు గుర్తించినా సరైన ఆధారాలు లభించకపోవటంతో తప్పించుకుంటున్నారని పోలీసులు పేరొంటున్నారు.

నేపాలీ దొంగల ముఠా - నమ్మారో ఇల్లు గుల్ల! - Nepali thieves

తాజాగా అంబర్‌పేట్‌ ఠాణా పరిధిలో చైన్‌స్నాచర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ తనం చేయడానికి గల కారణాలను తెలుసుకోగా ఆశ్చర్యమైన సమాధానం చెప్పాడు. తన భార్యను విహారయాత్రకు తీసుకెళ్లేందుకు చోరీ చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నగరానికి చెందిన ఓ బ్యాంకు మేనేజర్‌. పొదుపు సంఘాల్లోని మహిళల పేరిట బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. ఆ తరువాత చేతికి వచ్చిన రూ.1.5కోట్లను షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. లాభాలతో విల్లా కొనాలనుకున్నాడు. అనంతరం అసలు సొమ్మును బ్యాంకులో జమ చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. చివరకు షేర్‌మార్కెట్‌లో నష్టాలు వచ్చాయి. దీంతో బ్యాంక్ మేనేజర్ పథకం బెడసికొట్టి జైలు పాలయ్యాడు.

ముషీరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు బెంగళూరు నుంచి కొకైన్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ టీజీన్యాబ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. 30-40 గ్రాముల కొకైన్‌తో రూ.లక్షన్నర చేతికి అందటంతో సొంతిల్లు, కారు కొనేందుకు ఇలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. సొంతిల్లు, కారు, విదేశీ యాత్రలు, పిల్లలకు ఖరీదైన పాఠశాలల్లో చదువుల పేరుతో మోసాలు చేస్తున్నారు. సమాజంలో తమ హోదాను పెంచుకోవాలనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తున్నారు.

అసలు ఎటువంటి వైద్యపరిజ్ఞానంలేని ఒక వ్యక్తి డాక్టర్‌గా చెలామణీ అయ్యాడు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రమాదకరమైన జబ్బులు తగ్గిస్తానంటూ జనాలతో ఊదరగొట్టాడు. శివారు ప్రాంతాల్లో వెల్‌నెస్‌ రిసార్ట్స్‌లో సేదతీరుతూ, ఆనందం, ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటూ రూ.లక్షలు సేకరించాడు. స్థిరాస్తి సంస్థలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావచ్చనే ఆశతో వందలాది మందిని మోసగించాడు. ఇలా నగరంలో రోజురోజుకు మోసాలు ఎక్కువవుతున్నాయని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

'ఈ దొంగ స్టైలే వేరప్పా - డబ్బు ముట్టడు - బంగారం తాకడు - మొబైల్ ఫోన్లు మాత్రం వదలడు' - Mobile thief In Yellandu

ABOUT THE AUTHOR

...view details