Falling Temperature In Telangana :తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
లా నినా ప్రభావంతోనే ఇంత చలి : మరీ ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచు కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా ఆ ప్రభావం అలాగే ఉంటోంది. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలను నడిపించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో సాధారణ, రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, 'లా నినా' ప్రభావంతో ముందు ముందు మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచన :చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 2024 జనవరి సీజన్‌లో హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈసారి మరింత తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ మెట్రాలజీ విభాగం స్పష్టం చేసింది.
ఈసారి ఇప్పటి వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే
- దుండిగల్ 20.4
- హకీంపేట్ 19.9
- హైదరాబాద్ 21.3
- హయత్నగర్ 21
- పటాన్చెరు 18.6
- రాజేంద్రనగర్ 21
వయస్సు పైబడిన వారు జాగ్రత్త :ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకుపోవటంతో పాటు, రక్తం గడ్డకట్టే సమస్యలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. వేడి పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వంట చేసుకుని తినడం మేలని సూచిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒకసారైనా బాడీ చెకప్ చేసుకుంటే మేలని తెలిపారు.