Fake Marriage Scams in Andhra Pradesh :తల్లిదండ్రులు చనిపోయిన ఓ పేద యువతి. ఆమెకు పెళ్లి చేయాలని చూసే ఓ అక్క, ఓ బావ. వీరికి తోడు ఓ అన్న, వదిన. మీతో పాటే మేమంటూ అత్తమామలు, ఆడపడుచు. వీరంతా కలిసి ఆ యువతిని ఓ మంచి అయ్య చేతిలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే వ్యక్తి కోసం వెతుకుతారు. నిజమే అనుకుని నమ్మి వచ్చిన వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము గుంజి పత్తాలేకుండా పోతారు. తర్వాత మరోచోట సేమ్ సీన్ రిపీట్ చేస్తారు. ఇంతకీ వారంతా ఎవరంటే పెళ్లి కాని ప్రసాదులను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్న ముఠాలోని సభ్యులు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ముఠాల వలలో చిక్కుకొని పదుల సంఖ్యలో బాధితులు రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవలే ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువ ఉండటంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క, వయసు ఎక్కువ అయిన వీరు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులను ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు పురుడుపోసుకున్నాయి.
రావి-వేప చెట్టుకు ఘనంగా పెళ్లి - ఇలాంటి వింత వివాహాన్ని మీరెప్పుడైనా చూశారా?
40 ఏళ్లు దాటాయని రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు :రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువుల కోసం వెతికినా దొరకలేదు. భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి పెళ్లికి సిద్ధంగా ఉందని మధ్యవర్తులు ఆయనకు తెలిపారు. ఆ వ్యక్తి భీమవరం చేరుకోగా, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని యువతిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి అతడి వద్ద నుంచి రూ.4.5 లక్షలు లాగేశారు. పెళ్లి చేసుకొని ఆమెను సొంతూరికి తీసుకెళ్లగా, రెండు రోజులకే అనారోగ్యమంటూ డ్రామా మొదలుపెట్టింది. వారం రోజుల తర్వాత తమ వాళ్లను చూసొస్తానని పట్టుపట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చారు. టౌన్ రైల్వేస్టేషన్‌కు వచ్చాక మాయమాటలు చెప్పి వధువు కనిపించకుండా పోయింది. వరుడు మధ్యవర్తులకు ఫోన్ చేసి ఆరా తీయగా, నకిలీ పెళ్లి వలలో చిక్కుకున్నట్లు తెలిసింది.
ఒక్కో ఊర్లో ఒక్కో పాత్రధారులు :ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇదే తరహాలో రూ.3 లక్షలు ఇచ్చి మోసపోయాడు. సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి రూ.8 లక్షలు లాగేశారు. కర్ణాటకలోనూ ఈ ముఠాల వలలో చిక్కుకున్న బాధితులు ఉన్నట్లు సమాచారం. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్లాక రాత్రికి రాత్రే నగదు, నగలతో ఉడాయిస్తున్నారు. పశ్చిమ గోదావలి జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్నగా, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లి గూడెంలో ఆడపడుచులుగా నటిస్తున్నవారున్నారు. వీరంతా వారి మాయమాటలతో ఎదుటివారిని కట్టిపడేయడంతో ఆరితేరినవారు. తల్లిదండ్రులు లేని పిల్ల, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. మీతో పెళ్లయిన తర్వాతైనా సుఖపడుతుంది అంటూ వారు చెప్పే మాటలు అవతలి వారి మనసును ఇట్టే కరిగిస్తాయి. పెళ్లయిన కొద్ది రోజులకు గానీ వారు మోసపోయారన్న సంగతి వారికి తెలియదు.
కల్యాణం తర్వాత కొలువులకు స్వస్తి - అదే ప్రధాన కారణం!
పెళ్లి కోసం పాదయాత్ర - 110 కిమీ నడిచిన 62 మంది యువకులు