Handwriting Tricks In Exams : పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కష్టపడి చదువుతాం. అలాగే సమాధానాలు రాసేటప్పుడు చేతిరాత రాసే తీరు కూడా బాగుండాలి. లేకుంటే ఎంత చదివినా వ్యర్థమే. మీరు ఏం రాశారో అన్నది సమాధాన పత్రంలో కరెక్షన్ చేసేవారికి అర్థమవ్వాలి. చేతిరాత అందంగా లేకపోతే మార్కులు పడవు. పరీక్షలు ఎలా రాయాలో నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవేంటో చూసేయండి.
పరీక్ష ఎలా రాయాలంట? :పరీక్షలు రాసేముందు రాత్రింబవళ్లు కష్టపడి చదివినవన్నీ గుర్తుండాలంటే ఒక్కసారి రాసి చూసుకోవాలి. ఇలా రాయడం వల్ల చదివినవి గుర్తుకొస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు. అక్షర దోషాలుంటే సరి చేసుకోవచ్చు. దేనికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. ఆ తర్వాత పరీక్ష హాలులో రాయడానికి సులువుగా ఉంటుంది.
చేతిరాత రాసేతీరు : పరీక్ష హాలులో ఇచ్చే సమాధాన పత్రంలో 14 నుంచి 16 వరుసలు రాయవచ్చు. అయితే ఒక్కొక్క లైన్ ఆరు నుంచి ఏడు పదాలు ఉండేలా చూసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ రాస్తే చేతిరాత ఇరికించినట్లుగా కనిపిస్తుంది. అలాగే రాసేటప్పుడు ఎక్కడైనా తప్పులు రాస్తే పదే పదే కొట్టేయకుండా ఆ పదాన్ని అడ్డగీతతో కొట్టేసి తిరిగి పక్క నుంచి రాయాలి. ఎక్కువ తప్పులు రాయకుండా జాగ్రత్తపడాలి. సమాధానం చివర ఫుల్స్టాప్ ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి.