Malla Reddy in another land Dispute : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. దగ్గరి చుట్టమే కదా అని నమ్మితే మల్లారెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని దోమలగూడకు చెందిన 87 ఏళ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
నాకు రావాల్సిన డబ్బును ఇప్పించండి :కళ్లెం నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని యాడారంలో సర్వే నంబర్ 249, 250లో తనకు 23.26 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో 9.29 ఎకరాలను రూ.21.88 కోట్లకు కొనేందుకు తనతో మల్లారెడ్డి ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం విడతల వారీగా రూ.8.03 కోట్లు చెల్లించినట్లుగా వివరించారు.
నాలాంటి వృద్ధుడికి మోసం చేయడం సమంజసం కాదు :మిగతా రూ.14 కోట్లు తర్వాత ఇస్తానని నమ్మించి భూమిని సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై మల్లారెడ్డి జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఆ తర్వాత మిగిలిన రూ.14 కోట్లకు చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయినట్లుగా చెప్పారు. 40 రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదన్నారు. తనకు రావాల్సిన సొమ్మును ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.