BJP MP Etela Comments on Rally Clash :కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మార్చే క్రమంలో అనేకసార్లు మతకల్లోలాలు సృష్టించిందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. శవాల మీద కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయాల మీద దాడి జరుగుతుంటే అడ్డుకునే దమ్ము ముఖ్యమంత్రికి లేదన్నారు. సికింద్రాబాద్ ఆలయం వద్ద ధర్నా సమయంలో ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్లీపర్ సెల్స్ ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు ఉన్నాయని చెబుతున్నాయి తప్పితే ఇక్కడి ప్రభుత్వం గుర్తించడం లేదని అవేదన వ్యక్తం చేశారు. హిందువుల మీద విషం చిమ్మేలా సమావేశాలు జరుగుతుంటే ఎందుకు నిరోధించడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులు ఎవరూ, స్లీపర్ సెల్స్, సంఘ విద్రోహ శక్తులు ఎవ్వరో నిగ్గు తేల్చేల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వైఖరి వల్ల ఎన్నోసార్లు మతకలహాలు :ఎవరూ చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం ఒక్కటి కూడా బయట పెట్టలేదని ఈటల దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేస్తుందని మండిపడ్డారు. బాంబు దాడులు, హత్యలను ఏ మత పెద్దలు హర్షించరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికైనా అక్రమ అరెస్టులను ఆపాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.