Essentials Prices Increased During Festival Season :పండుగల సీజన్ వేళ నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లు, మాల్స్‌లోనూ సరకుల ధరలు మండిపోతున్నాయి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల 14న ప్రకటించగా, మరుసటి రోజు నుంచే వాటి ధరలు పెరిగాయి. కేంద్రం కేవలం ఆయిల్‌పామ్, సోయా, పొద్దు తిరుగుడులపై మాత్రమే సుంకం విధించినా, మిగిలిన అన్ని వంట నూనెల ధరలనూ కంపెనీలు, వ్యాపారులు పెంచేశారు.
అవకాశంగా తీసుకుని ధరలు పెంచి :పండుగల సీజన్‌ను వ్యాపారులు తమకు అవకాశంగా తీసుకోవడంతో నూనెల ధరలు పెరిగిపోయాయి. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. ఆన్‌లైన్ విక్రయ సంస్థలు కూడా ధరలను పెంచాయి. మాల్స్‌లోని నిల్వలను నల్ల బజారుకు తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారు. రాష్ట్రంలో రోజుకు 100 టన్నుల నూనె వినియోగమవుతుంటే, పండుగల సమయాల్లో రోజుకు 150 టన్నులు వినియోగిస్తారు. ఈ లెక్కన ధరల పెరుగుదల వినియోగదారులకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారింది.
అల్లం వెల్లుల్లి ధరలు పెరిగిపోతున్నాయి :వారం రోజుల వ్యవధిలోనే అల్లం, వెల్లుల్లి ధరలు రూ.60 చొప్పున పెరిగాయి. అల్లం కిలో రూ.100 నుంచి రూ.160 పలుకుతుండగా, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360కి పలుకుతుంది. మాల్స్‌లో అయితే వెల్లుల్లి ధర రూ.400. ఉల్లిపాయలు గత పదిహేను రోజుల నుంచి కిలో రూ.60కి తగ్గడం లేదు. ఎండు మిర్చి ధర కిలో రూ.200 నుంచి రూ.250కి పెరిగింది. మరోవైపు పప్పుల ధ1రలు సైతం మండిపోతున్నాయి. కందిపప్పు కిలో ధర వారం వ్యవధిలో రూ.20 పెరిగి రూ.170కి చేరగా, పెసరపప్పు రూ.30 పెరిగి రూ.150కి, మినప పప్పు రూ.15 పెరిగి రూ.135కు, సెనగ పప్పు రూ.5 పెరిగి రూ.105 కు చేరాయి.
నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA