Konapapapeta Merging in Sea :అల్పపీడనాలు, తుపాన్లు అంటే అక్కడి ప్రజలు వణికిపోతారు. ఇక సముద్రం నుంచి ఎగసిపడి తాకే రాకాసి అలలంటే వారు భయాందోళనలకు గురవుతారు. ఆ అలల తాకిడికి వారి ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. దీంతో వందల కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో వచ్చిన మూడు తుపాన్ల కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామ భూభాగం తీవ్ర కోతకు గురైంది.
రెండు సంవత్సరాల కాలంలో సుమారు 50 మీటర్ల మేర ఇక్కడి భూభాగం సముద్రంలో కలిసిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సిమెంట్ రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి ఎగసిపడిన కెరటాలకు ఆరు గృహాలు నేలకూలినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో తుపాను మీదపడితే ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక వారు సతమతమవుతున్నారు.
4000లకుపైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు సుమారు 200 మీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో మత్స్యకారుల నివాసాలు ఉండేవి. వాటిలో సుమారు 600 మంది నివసించేవారు. సముద్ర కోత కారణంగా నాలుగు వరుసల్లోని దాదాపు 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. దీంతో సుమారు 400 మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం రెండు వరుసల్లో యాభై ఇండ్లు మాత్రమే మిగిలాయి. వీటిలో 70 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది నివాసం ఉంటున్నారు.
Sea Effect on Konapapapeta :వీరి ఇండ్లు కూడా ప్రమాదపు అంచున ఉండటంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు గ్రామంలో మరోచోట స్థలాలు కొనుగోలు చేసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పాడకు రక్షణ గోడ నిర్మించినట్లుగానే కోనపాపపేటకు కూడా కట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.