Electric Vehicle Registrations :తెలంగాణలో విద్యుత్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారుల్ని ఆకర్షిస్తుండడంతో కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ల కొనుగోలు క్రమక్రమంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించింది. దీంతో ఈ నెల 3 వరకు సుమారు 16 రోజుల్లోనే 3 వేల 372 ఎలక్ట్రిక్ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి.
గత సంత్సరం ఇదే వ్యవధికి ఆ సంఖ్య 2,708 ఉండగా కొత్త పాలసీతో 24.52 శాతం వృద్ధి నమోదైంది. ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ ట్యాక్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఉంటుందని, వాహనాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ విధానం 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వాహనాలపై ప్రకటించిన రాయితీల ద్వారా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఏడాది విజయాల లెక్కలు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రవాణాశాఖ విజయాల్లో భాగంగా ఈవీ రిజిస్ట్రేషన్ల వివరాల్ని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 78 వేల 262 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని రవాణాశాఖ తెలిపింది. అంతకముందు ఏడాదిలో 51,934 ఈవీల రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంతో పోలీస్తే తమ ఏడాది పాలనలో ఈవీల రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని తెలిపింది.