Election Commission of India :రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎండ తీవ్రత, వడగాలులు ఉన్నందున పోలింగ్ సమయంలో మరో గంట పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని నేతలు సూచించారు.
పార్టీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలోని రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్‌కు అనుమతించాలని సీఈసీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కోరారు. స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ వేసవి తీవ్రత, వడగాలుల ప్రభావంతో పాటు, ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్టోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఏప్రిల్ చివరి వారం నుంచి పరిస్థితి దారుణంగా మారింది. రాబోయే రోజుల్లోనే ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఓటింగ్ సమయాన్ని గంట పెంచింది.