EC Bans Former CM KCR From Election Campaign :బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్పై ఈసీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్పై చర్యలకు ఈసీ పూనుకుంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ ఫిర్యాదు చేశారు.
ఈసీకి కేసీఆర్ ఇచ్చిన వివరణ :ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ కేసీఆర్ సమాధానం కోరింది. దీనికి గులాబీ బాస్ వివరణ ఇచ్చారు.తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారన్నారు. తాను కేవలం కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది.