Employment Opportunities Abroad For JNTU Students :జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU)లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ అధికారులు వినూత్న కార్యాచరణ సిద్ధం చేశారు. విదేశాల్లో ఉన్నత స్థాయి జాబ్స్ చేస్తూ సాఫ్ట్వేర్ సంస్థల అధిపతులుగా ఉన్న పూర్వ విద్యార్థుల సహాయంతో ఇక్కడి విద్యార్థులకు ఫెలోషిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, జాబ్స్ ఇప్పించేలా అభ్యర్థించనున్నారు.
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో గ్లోబల్ అలుమ్నీ మీట్ :ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వినూత్న నైపుణ్యాలు, ఆలోచనలు లేకపోవడంతో చాలా మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దీంతో కొద్ది నెలలుగా బహుళజాతి సంస్థలు ప్రాంగణ నియామకాలపై ఆసక్తి చూపడం లేదు. ఈ అంశాలను గమనించిన జేఎన్టీయూ అధికారులు ఇతర దేశాల్లోని పూర్వ విద్యార్థులను సంప్రదించారు. వారు సకారాత్మకంగా స్పందిస్తారనే భావనతో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో క్యాంపస్‌లో జరగనున్న గ్లోబల్ అలుమ్నీ మీట్ వేదికగా చేసుకున్నారు.
విశ్వవ్యాప్త అనుసంధానం : -
- అలుమ్నీకి ఇతర దేశాల్లో ఉంటున్న 18,000 మంది పూర్వ విద్యార్థులు వచ్చే అవకాశాలు ఉండటంతో వారితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రస్తుత విద్యార్థుల్లో అర్హులైన వారి ప్రతిభను వివరించనున్నారు.
- గత విద్యార్థుల వృత్తి, వ్యక్తిగత వివరాలను విశ్వవిద్యాలయం అధికారులు సేకరించి విశ్వ వ్యాప్త అనుసంధానం చేయనున్నారు.
- ఇక్కడి పూర్వ విద్యార్థులు 30 శాతం మంది సొంతంగా సాఫ్ట్వేర్, ఇతర సంస్థలను నిర్వహిస్తుండగా, 70 శాతం మంది బహుళజాతి సంస్థల్లో సీవోవోలు, సీఈవోలుగా పని చేస్తున్నారు.
- విద్యా రంగంలో వస్తున్న మార్పులు, చేర్పులు పరిశోధనలను గ్లోబల్ కనెక్టివిటీ ద్వారా మరింత పెంపొందించనున్నారు. పరిశోధనలు, శాస్త్రీయ, ప్రాజెక్ట్ అభివృద్ధిలో వారి సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
- ఒక్కో దేశం, ప్రాంతంలో నివాసం ఉంటున్న పూర్వ విద్యార్థుల్లో ఒకరిద్దరిని ప్రతినిధులుగా నియమించి వారితో ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయం అధికారులు ఆన్లైన్ ద్వారా సమావేశాలను నిర్వహించనున్నారు.
- జేఎన్టీయూలో చదివి ఇతర దేశాల్లో స్థిరపడిన గత విద్యార్థుల్లో ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు.
- ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్‌లో చాలా మంది ఉన్నారు.