తెలంగాణ

telangana

ETV Bharat / state

Eenadu@50 : నలుచెరుగులా ఈనాడు జైత్రయాత్ర – ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు - Eenadu Golden Jubilee Celebrations - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

Eenadu Golden Jubilee Celebrations : విజయం ఒక గమ్యం కాదు, ఒక అనంత యాత్ర! ఈనాడు 50 ఏళ్ల మజిలీ కూడా అంతే! కళింగనేలపై పుట్టి, తెలుగువారి మేలుకొలుపైంది. అంచనాలు లేకుండా సంచనాలు సృష్టిస్తూ ఈనాడు జైత్రయాత్ర సాగిపోతోంది! ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉన్నచోట, రెండో తెలుగు ఎడిషన్‌ ప్రారంభించడం ఏడాది వయసులోనే ఈనాడు చేసిన సాహసం! ఆ తర్వాత తెలుగు నేల నలుచెరుగులా వేళ్లూనుకోవడం, రాష్ట్రం దాటి తెలుగువారు ఎక్కడుంటే అక్కడి వరకూ వెళ్లడం అసమాన్య విజయం! ఏ పత్రికకూ లేని బలం, బలగం ఈనాడు సొంతం! అందుకే సర్క్యులేషన్‌లో ఈనాడుది ఎవరూ అందుకోలేని అగ్రపీఠం.

EENADU 50 Years Celebrations
Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 6:00 AM IST

Updated : Aug 5, 2024, 9:20 AM IST

EENADU 50 Years Celebrations :విశాఖలో ఈనాడు ఎడిషన్ ప్రారంభించడానికి ఒక వారం ముందు సీతమ్మధారలోని ప్రెస్‌ ఆవరణలో సిబ్బందిని సమావేశపరిచారు రామోజీరావు. ఈనాడు భవిష్యత్‌పై మీ దగ్గర ఉన్న ప్రణాళికలేంటని అని అడిగారు. అసలు ప్రారంభమే కాలేదు, భవిష్యత్ అంటారేంటి అని అందరూ తెల్లమొహాలు వేశారు! ఐతే నేనే చెప్తానంటూ రామోజీరావు ఓ థియరీ చెప్పారు. తెలుగు చదవగలిగి, పత్రిక కొనసాగలిగినవారు 1974 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనాభా కోటిమంది! అప్పటి వరకు తెలుగునాట ఉన్న దినపత్రికల అన్నింటి సర్క్యులేషన్‌ కలిపినా రెండు లక్షలే. వాళ్లు ఈనాడు పత్రిక కొనకపోయినా పర్వాలేదు, మిగిలిన 90 లక్షలమందికి చేరువవడమే మన లక్ష్యం అన్నారు రామోజీరావు.

16 నెలలు గడిచేసరికి : ఈనాడును ఉత్తరాంధ్రకే పరిమితం చేయబోనని, అంచెలంచెలుగా తెలుగు నేల నలుమూలలకు తీసుకెళ్తానని విస్పష్టంగా చెప్పారు! ఆ సమయంలో అందరూ తేలికగా తీసుకున్నారు. 16 నెలలు గడిచాకగానీ సిబ్బందికి అర్థంకాలేదు రామోజీరావు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో! విశాఖలో ఈనాడుకు లభించిన ఆదరణ ఆయనలో మరింత ఉత్సాహం పెంచింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోనూ ఈనాడు ఉదయించింది. నాటి సీఎం జలగం వెంగళరావు, నాటి హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, తెలుగు ధ్రువతారలు ఎన్టీఆర్, ఏఎన్​ఆర్ సమక్షంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ ప్రారంభమైంది.

భాగ్యనగరంలో సరికొత్త వ్యూహాలు :హైదరాబాద్‌ నుంచి ఈనాడు ఎడిషన్‌ ప్రారంభిస్తుంటే అప్పట్లో వింతగా చూశారు. హైదరాబాద్ అప్పటి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ తెలుగు పత్రికల అనధికారిక రాజధానిగా విజయవాడ ఉండడమే దానికి కారణం. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో తెలుగు అరుదుగా కనబడేది, వినబడేది! తెలుగు మాట్లాడేవారు, చదివేవారు ఆరోజుల్లో తక్కువ. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హైదరాబాద్‌లో తెలుగు ఎడిషన్‌ ప్రారంభించేందుకు ఎవరూ సాహసించలేదు! సవాళ్ల సవారీ చేసే రామోజీరావు మాత్రం రెండో ఎడిషన్‌ లాంచింగ్‌కు హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. భాగ్యనగరంలో ఈనాడును పాఠకులకు చేరువ చేసేందుకు సరికొత్త వ్యూహాలు రచించారు.

Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

ఆ ప్రయత్నం సూపర్‌ హిట్ :మనం ఏ జాంగ్రీలో, జిలేబీలో కొనడానికి వెళ్తే మిఠాయికొట్టు యజమాని ముందు ఓ స్వీటు ముక్క రుచి చూపిస్తాడు. ఆ రుచి నచ్చి అర కిలో కొనాల్సిన కస్టమర్‌ కిలో కొనేస్తాడని ఆ వ్యాపారి విశ్వాసం. ఇదో రకమైన ఎపిటైజర్‌ ఎఫెక్ట్‌. వార్తలూ మిఠాయిల్లాంటివే. వార్తా పత్రిక పఠనం ఓ పాజిటివ్‌ వ్యసనం! ముందు రుచి చూపించాలి. క్రమంగా అలవాటు చేయాలి. తొలిరోజుల్లో ఈనాడు ఇదే ఫార్ములా పాటించింది. హైదరాబాద్‌లో తెలుగు చదివేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవటానికి ఓ సర్వే చేశారు.

కొద్దినెలలపాటు నగరం అంతా జల్లెడ పట్టి సుమారు 50 వేల చిరునామాలతో ఓ జాబితా రూపొందించారు! ఆ చిరునామాలకు వెళ్లి ఈనాడు ప్రతినిధులు హైదరాబాద్‌లో కొత్త పత్రిక ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఒక వారంపాటు ఉచితంగా అందిస్తాం. మీకు నచ్చితే పత్రిక చందాదారులుగా చేరండి, వద్దనుకుంటే మాకేమీ చెల్లించాల్సిన అవసరం లేదని వినమ్రంగా చెప్పారు! ఆ ప్రయత్నం సూపర్‌ హిట్ అయింది. వారంరోజులు ఉచితంగా పత్రిక వేస్తే 20 వేలమంది ఈనాడు చందాదారులుగా చేరారు. నాటికి రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా ఉన్న, ఆంధ్రప్రభ సర్క్యులేషన్‌ హైదరాబాద్‌లో 5 వేలలోపే! అలాంటిది ఈనాడు మాత్రం హైదరాబాద్‌ ఎడిషన్‌ 20 వేల ప్రారంభ సర్క్యులేషన్‌తో రికార్డ్‌ సృష్టించింది.

హైదరాబాద్‌ ఎంట్రీ అదిరిపోయింది :సూర్యోదయం కాకముందే పత్రికను పాఠకుల చేతిలో పెట్టాలనేది రామోజీరావు సంకల్పం. దాన్ని హైదరాబాద్‌లో మరింత పకడ్బందీగా అమలు చేసింది ఈనాడు! పత్రిక ప్రారంభానికి మూడు నెలల ముందే 100 మంది డిస్ట్రిబ్యూషన్‌ బాయ్స్‌ను ఉద్యోగంలో చేర్చుకున్నారు. రోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఆఫీస్‌కు రావడం, ఆరుగంటలకు వెళ్లిపోవటమే వారి పని. సహజంగా ఎవరైనా పనిచేయకుండా జీతం ఎందుకు ఇవ్వడం? పత్రిక ప్రారంభం అయ్యాక చేర్చుకుందాం అనుకుంటారు. కానీ రామోజీరావు అలాకాదు! డిస్ట్రిబ్యూషన్‌ బాయ్స్‌కు ఉదయమే లేవటం, సమయానికి ఆఫీసుకు రావటం, పత్రికను చందాదారుల వద్దకు చేర్చడాన్ని అలవాటు చేసేందుకు వారికి మూడునెలలు జీతాలు చెల్లించారు. అందుకే ఈనాడు హైదరాబాద్‌ ఎడిషన్ ఎంట్రీ అదిరిపోయింది! విశాఖలో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్‌ 4,500 కాపీలైతే, హైదరాబాద్‌లో ప్రారంభమయ్యేనాటికి ఆ సంఖ్య 12,892కి పెరిగింది. హైదరాబాద్‌ ఎడిషన్‌తో ఆ సర్క్యులేషన్ 48,339కి దూసుకెళ్లింది. ఏజన్సీల సంఖ్య కూడా 122 నుంచి 313కి పెరిగింది.

Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

రాజధానిలో ఈనాడు ప్రచురుణ ప్రారంభించడం ఈనాడుకు బాగా కలిసొచ్చింది. వార్తా సేకరణ యంత్రాంగం పటిష్ఠమై, వార్తల నాణ్యత పెరిగింది. పరిశోధనాత్మక జర్నలిజాన్ని అందిపుచ్చుకుంది. ప్రభుత్వాల అవినీతిని వెలికితీస్తూ సంచలనాలు సృష్టించింది. క్రమంగా పాఠకాదరణ చూరగొంటున్న ఈనాడును వినూత్న ప్రచార శైలితో తెలుగులోగిళ్లకు చేర్చారు రామోజీరావు! రామోజీరావును చాలామంది మార్కెటింగ్‌ మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. ఆయన దృష్టిలో మార్కెటింగ్‌ అంటే తిమ్మిని బమ్మిని చేయడం కాదు.

అబద్ధాలకు అందమైన ముసుగేసి పత్రికల్ని అమ్మేసుకోవడమూ కాదు. మనం ఇచ్చే వస్తువు నాణ్యమైనదైతే, వినియోగదారుణ్ని ఒప్పించడం అంత కష్టమేమీ కాదన్నది రామోజీరావు నమ్మిన సూత్రం. ఆ నమ్మకంతోనే మార్కెటింగ్‌ సిబ్బందిని ఈనాడు రాయబారులుగా ప్రకటించారాయన. గడప గడపకూ పంపారు. ప్రజలు కూడా ఈనాడు ప్రతినిధులను తమ వారిగానే గౌరవించారు. ఫలహారాలు పెట్టి మరీ పత్రికకు చందాలు కట్టారు. పత్రికలో మార్పుచేర్పులు సూచించారు. అలా రాజధానిలో బలంగా పాగావేసింది ఈనాడు.

ఈనాడు మూడో అడుగు విజయవాడలో :అలా జంటనగరాల్లో వేళ్లూనుకున్నఈనాడు తన మూడో అడుగు విజయవాడలో మోపింది. 1978 మేడే రోజున విజయవాడ ఎడిషన్‌ అప్పటి గవర్నర్‌ శారదా ముఖర్జీ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. అప్పటి వరకూ రాష్ట్రంలో మూడు కేంద్రాల నుంచి ప్రచురితమవుతున్న పత్రికే లేదు. ఆ ఘనత సాధించడం ఈనాడు వ్యాప్తికి బాగా కలిసొచ్చింది. విజయవాడ ఎడిషన్‌ ప్రారంభంతోనే సర్క్యులేషన్‌లో లక్ష మైలురాయిని అధిగమించింది. అప్పటివరకూ ఎక్కువ సంచికలు అమ్మే ఆంధ్రప్రభను వెనక్కి నెట్టేసి అగ్రగామి తెలుగు దినపత్రిక స్థానాన్ని ఈనాడు కైవసం చేసుకుంది. 46 ఏళ్లుగా ఈనాడే నంబర్‌ వన్‌! లేట్‌నైట్ వార్తలు కూడా పాఠకులకు అందించాలన్నది రామోజీరావు ఆశయం. ప్రచురణ కేంద్రాలు జిల్లాలకు విస్తరిస్తేనే అది సాధ్యమని నమ్మారాయన. ఆ దిశగానే జిల్లాలవారీగా ముద్రణకు శ్రీకారం చుట్టారు.

Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

రాయలసీమలో జెండా ఎగరేసిన ఈనాడు : తిరుపతిలో నాలుగో యూనిట్‌ ప్రారంభించి రాయలసీమలో ఈనాడు జెండా ఎగరేశారు. 1981 వరకూ విజయవాడ, హైదరాబాద్‌లో పత్రికలు ముద్రించి రాయలసీమ ప్రాంతానికి పంపేవారు. 1982 జూన్‌ 20న తిరుపతి నుంచి ముద్రణ మొదలుపెట్టి తాజా వార్తల్ని ఎప్పటికప్పుడు పాఠకులకు అందించింది ఈనాడు. తిరుపతి యూనిట్‌ ప్రారంభోత్సవానికి ముందు ఈనాడు మరో కొత్త ప్రచార సరళితో పాఠకుల్లోకి వెళ్లింది. ప్రజాస్వామ్యానికి ఈనాడు పహారా కాస్తుందనే సందేశాన్ని నూతన ప్రసాద్, రమాప్రభ వంటి నటులతో బుర్రకథ ద్వారా చెప్పించింది. ఆ ప్రయత్నం 1991 ఫిబ్రవరి 24న అనంతపురం యూనిట్‌ ప్రారంభోత్సవాన్ని సులభం చేసింది! తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్‌ నుంచి ఈనాడు జెండా ఎగిరింది.

ఎంత కష్టమైనా పత్రిక మాత్రం ఆగలేదు :1992 వరకూ తెలంగాణలో హైదరాబాద్‌ మినహా మరెక్కడా పత్రికలు ప్రచురితం అయ్యేవికావు. హైదరాబాద్‌లో 8,9 గంటల వరకూ అందే వార్తలతో ముద్రితమయ్యే దినపత్రికలే తెలంగాణ ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఉత్తర తెలంగాణలో ఈ ఆవశ్యకతను గుర్తించిన ఈనాడు 1992 మార్చి 30న తెలుగువారి ఆరో ప్రాణంగా కరీంనగర్‌ ఎడిషన్ ప్రారంభించింది. నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడుకుతున్న ఉత్తర తెలంగాణలో పత్రికా ప్రచురణ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ప్రజాగొంతుకైన ఈనాడు నిర్భయంగా అడుగుపెట్టింది. నక్సల్స్ విధ్వంసంతో కొన్నిసార్లు కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతిన్నా ప్రచురణ కష్టమైందేగానీ పత్రిక మాత్రం ఆగలేదు. 1992 సెప్టెంబర్‌ 24న రాజమహేంద్రవరం ఎడిషన్‌ మొదలైంది.

తెలుగువాళ్లు ఎక్కడుంటే అక్కడ ఈనాడు :ఎనిమిదో ఎడిషన్‌ను సూర్యాపేటలో ప్రారంభించి, తెలంగాణ ప్రజలకు మరింత చేరువైంది. అదే ఏడాది అంటే 1996 ఏప్రిల్‌ 7న గుంటూరు ఎడిషన్‌ లాంచ్‌ చేసింది. 1997 మార్చి 19న నెల్లూరులో అడుగు పెట్టింది. 1999 ఆగస్టు 28న కర్నూలు, శ్రీకాకుళంలో, 2000 సంవత్సరం జనవరి 17న వరంగల్‌, కడప, తాడేపల్లి గూడెంలో ఈనాడు జెండా పాతింది వేసింది. అలా ఊహకందని వేగంతో దూసుకెళ్లిన ఈనాడు, 2002లో జెట్​ స్పీడ్ అందుకుంది.

2002 జూన్‌ 30న ఒకేరోజు ఏడు యూనిట్లు ప్రారంభించింది కొత్త ఒరవడి సృష్టించింది. ఒంగోలు, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌తోపాటు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి వార్తాదాహాన్ని తీరుస్తూ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాజధానుల్లోనూ కొత్త ఎడిషన్లు ఆవిర్భవించాయి. 2002 సెప్టెంబర్‌ 11న రామోజీరావు తొలి కలల నగరం దిల్లీ ఎడిషన్‌నూ ప్రారంభించారు. మొత్తం 23 ఎడిషన్లతో తెలుగునాట అంచెలంచెలుగా విస్తరించడమేకాదు, తెలుగువాళ్లు ఎక్కడుంటే అక్కడ వేళ్లూనుకుంది ఈనాడు.

పత్రికాప్రపంచానికే ఒక సక్సెస్‌ స్టోరీ : ఈనాడు సర్క్యులేషన్‌ వ్యూహం పత్రికాప్రపంచానికే ఒక సక్సెస్‌ స్టోరీ. ఎక్కడైనా ఓ పత్రిక ఎండీ వీధిలో నిలబడి పత్రిక అమ్మిన సందర్భాలున్నాయా? ఈనాడు విషయంలోనే అది జరిగింది. విశాఖలో ఈనాడు ప్రారంభించిన తొలినాళ్లలో అప్పటి రాష్ట్రపతి మరణించిన సందర్భంగా ప్రత్యేక సంచిక వేశారు. పేపర్‌ బాయ్స్‌తో పాటే అప్పటి ఎండీ రామమోహనరావు రోడ్డుపైకి వెళ్లారు. పేపర్‌బాయ్స్‌ అందరూ చేతిలో పత్రికలు పట్టుకుని గమ్మున నిలబడితే, ఆ పక్కనే ఉన్న రామమోహనరావు రాష్ట్రపతి మరణించిన సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అంటూ అరవడం మొదలుపెట్టారు. వెంటనే బాయ్స్‌ కూడా అందుకున్నారు. అలా పత్రిక సర్క్యులేషన్‌ పెంచడంలో ఈనాడు అనుసరించిన వ్యూహాలెన్నో ఇతర పత్రికలకు మార్గనిర్దేశం చేశాయి.

Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

ఈనాడు ఉషోదయం ఏనాడూ ఆగలేదు : చందాదారుల్ని చేర్పించడం కోసమే మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే సొంత వ్యవస్థను సృష్టించుకున్న మొదటి పత్రిక ఈనాడే. దానివల్లే వరదలొచ్చినా, ఉపద్రవాలొచ్చినా ఈనాడు ఉషోదయం ఏనాడూ ఆగలేదు. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడూ, ఖర్చుకు వెనకాడకుండా పత్రికను పంపిణీ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో హెలికాప్టర్‌ ద్వారా పత్రికను పాఠకులకు అందించిన అనితర సాధ్యమైన సాహస ఘట్టాలు ఈనాడుకే సాధ్యం.

1988 డిసెంబర్‌లో వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు దుండగులు విజయవాడలోని కార్యాలయాలన్ని, ముద్రణాయంత్రాన్నీ దహనం చేశారు. పత్రిక మాత్రం ఆగలేదు. తిరుపతి యూనిట్‌ నుంచి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు, హైదరాబాద్‌ నుంచి కృష్ణా, ఖమ్మం జిల్లాలకు పేపర్ పంపిణీ చేశారు. ఈనాడు ఉద్యోగులు కూడా ఆనాడు సైనికుల్లా బండిళ్లు భూజానికెత్తుకుని బట్వాడా చేశారు. కష్టసమయాల్లో అలాంటి తెగువ చూపే సిబ్బంది, ఏజంట్లు, విలేకరులతో ఈనాడును ఓ పటిష్ఠ వ్యవస్థగా తీర్చిదిద్దారు రామోజీరావు.

Eenadu Golden Jubilee Celebrations (ETV Bharat)

ఏ పత్రికకూ సాధ్యంకాని డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ : సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్‌బాయ్‌ వీధుల్లో కనిపించకూడదని గిరిగీశారు రామోజీరావు. అందులో భాగంగా వేళ్లూనుకుందే ఊరూరా సొంత ఏజంట్లు, ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ. ఆ రోజుల్లో జిల్లాల్లో కేవలం ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇతర పత్రికలకు ఏజెంట్లు ఉండేవారు. పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. పల్లెలకు రైళ్లు, బస్సుల్లో పంపాలి. మన పత్రిక ఎలా? ఎప్పుడు? ఎక్కడికి చేరాలో మన చేతుల్లో ఉండాలన్నది రామోజీరావు నిశ్చితాభిప్రాయం! అప్పుడు మొదలైందే ప్రైవేట్‌ టాక్సీ ప్రయోగం. రూట్ల వారీగా టాక్సీలతో పేపర్‌ రవాణా చేయించారు. రోడ్డు సరిగాలేని గ్రామాలకు బైకుల ద్వారా పంపించారు. అలా గిరులు, ఝరులు దాటి అడవులు, మారుమూల పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. బస్సులు, రైళ్లు, తపాలాసేవల ద్వారా సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది.

పేపర్‌ రవాణా వ్యవస్థ స్ట్రీమ్‌లైన్ అయ్యాక ఏజంట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది ఈనాడు! ఐదువేల జనాభా కలిగిన ప్రతీ గ్రామాన్ని రిసోర్స్‌ఫుల్‌ విలేజ్‌గా గుర్తించి, అక్కడ ఈనాడు ఏజంట్లను వెతికిపట్టుకున్నారు. ఊళ్లలో డిపాజిట్లు కట్టగలిగే స్థోమత లేని వారికి కూడా ఏజెన్సీలు ఇచ్చి, వారి కమిషన్‌ నుంచి మినహాయించుకునేది. అలా ట్రాన్స్‌పోర్ట్‌ సవాళ్లను స్వతహాగా పరిష్కరించుకుని చిన్న పట్టణాలు, పల్లెలకూ ఉషోదయంలోపే పేపర్‌ చేరుతోంది. మిగతా పత్రికలకంటే ముందే ఈనాడు పత్రిక పాఠకుల ఒడిలో వాలుతోంది! ఏ పత్రికకూ సాధ్యంకాని డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థే ఈనాడు లార్జెస్ట్‌ సర్క్యులేషన్‌కు రక్షణ కవచం.

ఎవరికీ అందనంత ఎత్తులో ఈనాడు : ఈనాడు విస్తరణతోపాటే సర్క్యులేషన్‌ కూడా దూసుకెళ్లింది. ప్రాంతీయ పత్రికగా ప్రారంభమై, జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తిని రెపరెపలాడిస్తోంది. 1974లో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్‌ 4,500. అప్పుడు ఏజన్సీలు 32. 50 ఏళ్ల ప్రస్థానంలో 21 కేంద్రాల ద్వారా ప్రచురితమవుతున్న ఈనాడు 11 వేల ఏజన్సీలతో 13 లక్షలకుపైగా కాపీలతో ది లార్జెస్ట్‌ తెలుగు డైలీగా వెలుగొందుతోంది. సర్క్యులేషన్‌లో ఈనాడు ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాగ్రంపై స్థిరపడింది.

Eenadu@50 : నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు' - Eenadu Golden Jubilee Celebrations

Last Updated : Aug 5, 2024, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details