Prahari Clubs Formed in High Schools to Combat Drug Abuse : తెలంగాణలో డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై కాగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలను వినియోగిస్తూ యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుంది. అందులో భాగంగా స్కూల్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టేందుకూ వెనకాడటం లేదు. తాజాగా స్కూల్ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు కొత్త తరహా ప్రాణాళిక అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పోలీసు నిఘాను పెంచిన సర్కారు, తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయనుంది. గతంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపారు. తాజాగా వాటిని ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, శనివారం జీవోను జారీ చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలను వినియోగించకుండా, వాటిని పాఠశాల చుట్టుపక్కల ఎవరూ విక్రయించకుండా ఈ క్లబ్‌లు పటిష్ఠ చర్యలు తీసుకొనున్నాయి. డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతోపాటు నిరంతరం నిఘా వేసి ఉంచుతాయని జీవోలో తెలిపారు.