Sexual Harassment at Workplace : పని చేసే చోట లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. సహ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆసుపత్రి సిబ్బందికి కంప్లైట్ చేసినా పట్టించుకోకుండా తిరిగి ఆమెను మందలించడంతో మనస్తాపానికి గురైన మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను వదిలి లోకం విడిచి వెళ్లిపోయింది. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు కుటుంబీకులు ధర్నాకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో బాధితురాలు ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. 3 నెలల కిందటే ఆమె ఆసుపత్రి ఉద్యోగిగా చేరారు. ఉద్యోగంలో చేరిన దగ్గరి నుంచి సహోద్యోగి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తోటి ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె అసహనానికి గురయ్యారు. ఇదే విషయాన్ని కొద్ది రోజుల కిందట తల్లికి చెప్పి విలపించారు.
దీంతో ఆమె తల్లి అక్కడ ఉద్యోగం మానేయాలని చెప్పింది. కానీ ఉపాధి లేక అక్కడే ఉద్యోగ విధులు నిర్వహిస్తూ వచ్చింది. ఆప్తమాలజీ విద్యను పూర్తి చేసిన బాధితురాలు ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఉద్యోగానికి ఎంపికైంది. వచ్చే డిసెంబరు 1న కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. సూర్యాపేటలోని ఆసుపత్రిలో 3 నెలలుగా చేస్తున్నా జీతం రాకపోవడంతో కొత్త ఉద్యోగంలో చేరేంత వరకు విధులు నిర్వహిస్తానని ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది.
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చేరే ముందు ఆమె పని చేస్తున్న ఆసుపత్రి నుంచి డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. దీనికి ఆసుపత్రి యాజమాన్యం సర్టిఫికెట్ ఇవ్వాలంటే తాము చెప్పిన పని చేయాలంటూ వేధించే వారని పలువురికి చెప్పి ఆందోళనకు గురైంది. సోమవారం ఆసుపత్రిలో విధులకు హాజరైన ఆమె, తల్లి వద్దకు వెళ్లి విషయం చెప్పి బోరుమని విలపించింది. ఓదార్చిన తల్లి ఆమెను తిరిగి ఇంటికి పంపించింది. భర్తకు ఫోన్ చేసిన ఆమె, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ చెప్పి కాల్ కట్ చేసింది. భార్య అలా చెప్పి కాల్ కట్ చేయడంతో అనుమానం వచ్చి భర్త హుటాహుటిన ఇంటికి చేరుకొనే సమయానికే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.