A Man Died Of Heart Attack In Temple : గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె.విష్ణు వర్ధన్(31), హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ గుడికి వెళ్లి ఆంజనేయుడిని దర్శించుకునే అలవాటు ఉంది. సోమవారం ఉదయం కూడా ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేశాడు.
ఆ తర్వాత ధ్యాన మందిరం మెట్లపై కూర్చుని సేదతీరాడు. కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ఫిల్టర్ దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. భక్తులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోపే మరణించాడు. ఇదంతా గుడిలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఇతడు చాలా రోజుల నుంచి వైరల్ జ్వరంతో బాధపడినట్లు తెలిసింది. విష్ణువర్ధన్ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షలు చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
గుండెపోటు లక్షణాలు : ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న వారు, ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. గుండెపోటును ముందుగానే గుర్తించలేకపోవడంతోనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఛాతీలో ఎడమ వైపు నొప్పి వస్తుంది. ఏదో బరువు మోస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయాసం, చెమటలు పడతాయి. కొంత మందికి అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా హార్ట్ ఎటాక్ రావొచ్చు. ఇటీవల ఓ 55 ఏళ్ల వయసు గల వ్యక్తి గడ్డి కోస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడు. అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా, ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు రావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వెంటనే అన్నీ పరీక్షలు చేసి ఫలితాలకు అనుగుణంగా చికిత్స చేస్తారు. అవసరమైతే యాంజియోగ్రామ్ చికిత్స అందిస్తారు.