DY CM Bhatti visits Peddapur Gurukul School : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణం చాలా బాధాకరమని, వీరి మరణం ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల మరణంతో పాటు నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, మంగళవారం పాఠశాలను సందర్శించారు.
మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారులను కోల్పోయి కంటతడి పెట్టిన తల్లిదండ్రులను భట్టి ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలియ తిరుగుతూ సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు :రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలన్నీ పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గురుకులాల భవన నిర్మాణాలకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించామని, పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తిగా అందిస్తామన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కింద రూ.5 లక్షలతో ఇల్లు నిర్మిస్తామని, వారిలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.