Duolingo Exam Scam in Hayathnagar :డ్యులింగో పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్(వీడియో) విధానంలో జరుగుతుంది. అంతర్జాతీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఆంగ్లంలో అభ్యర్థికి ఉన్న ప్రతిభను గుర్తించేందకు పరీక్ష నిర్వహిస్తారు. చాలా యూనివర్సిటీలు దీనిని ప్రామాణికంగా తీసుకుని, అందులో అర్హత సాధించిన వ్యక్తిని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు సమయం, తేదీతో స్లాట్ ఇస్తారు. గంటపాటు జరిగే పరీక్షలో అభ్యర్థి తెర ముందు ఉండాలి. నిర్వాహకులు వీడియో ద్వారా వారి ప్రవర్తనను పరీక్షిస్తూ సగం తెరపై ప్రశ్నలు ఇస్తుంటారు. సమాధానం ఇచ్చే సమయంలో అభ్యర్థి ఎక్కువసార్లు కదిలినా, అనుమానాస్పదంగా ప్రవర్తించినా వెంటనే అనర్హుడిగా గుర్తించి లాగ్‌ఔట్ అవుతారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ గ్రామానికి చెందిన కందకుంట్ల ప్రవీణ్‌రెడ్డి హయత్‌నగర్‌లో ఉంటూ నారాయణగూడ కేశవ మెమోరియల్‌లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లోని వర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డ్యులింగో పరీక్షకు గతంలో హాజరై అర్హత సాధించాడు. ఇతనికి ఆంగ్లంలో మంచి నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన హయత్‌నగర్‌కు చెందిన బీబీఏ, బీకాం విద్యార్థులు త్రివేది హరినాథ్, బాణాల కృష్ణ అతణ్ని సంప్రదించారు.
JEE Advanced Exam Mass Copying In Hyderabad : జేఈఈ అడ్వాన్స్‌డ్ మాస్ కాపీయింగ్.. ఎలా జరిగిందంటే..
బీటెక్ పూర్తయి విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులు తమకు తెలుసని, వారి బదులు డ్యులింగో పరీక్షకు హాజరైతే, రూ.5,000ల నుంచి రూ.10,000ల చొప్పున ఇస్తామని ప్రవీణ్‌కు ఆశచూపారు. డబ్బుకు ఆశపడ్డ ప్రవీణ్, అంగీకరించడంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. ఇదే క్రమంలో బేగంపేటకు చెందిన బీటెక్ విద్యార్థులు ఎడవల్లి అరవింద్ రెడ్డి, నేనావత్ సంతోశ్, కాకతీయ వర్సిటీలో ఎంఎస్సీ విద్యార్థి మల్లాడి నవీన్ కుమార్, మీర్‌పేటకు చెందిన బీటెక్ విద్యార్థి ఆలకుంట్ల వినయ్ విదేశాల్లో చదివే ప్రయత్నాల్లో ఉన్నారు.