Huge Objections on DSC Exam Final Key : రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ తుది ‘కీ’పై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వందల మంది అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను తీసుకుని సోమవారం ఉదయమే పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయానికి తరలివచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం మొత్తం 2.45 లక్షల మంది పోటీపడ్డారు. ఈ నెల 6న రాత్రి డీఎస్సీ తుది 'కీ'ని విద్యాశాఖ ప్రకటించింది. ప్రాథమిక, తుది 'కీ'ల మధ్య సుమారు 109 ప్రశ్నల జవాబులను మార్చింది.
మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది. విద్యాశాఖ తుది ‘కీ'ని ప్రకటించిన తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సోమవారం సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వందల మంది అభ్యర్థులు విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది 'కీ'లో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించినా, తుది ‘కీ’లో వాటిని తప్పుగా చూపారని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు కె.లింగయ్య ఎస్‌సీఈఆర్‌టీలో టెట్ ప్రత్యేకాధికారి రేవతి రెడ్డికి వివరించారు.