Drugs Gang Arrest In Hyderabad: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ప్రవేశించేందకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలని పెకిలించడమే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా ర్యాపిడో డ్రైవర్లు, రేలింగ్ పనుల ముసుగులో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్‌వోటీ, సరూర్‌నగర్, మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
రాజస్థాన్ నగరంలోని బార్మర్ జిల్లాకు చెందిన రమేష్‌కుమార్, మహదేవ్రామ్ మరో ఇద్దరితో కలిసి 2022లో నగరానికి వలస వచ్చారు. రాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరికి వస్తున్న ఆదాయం సరిపోక పోవడంతో డ్రగ్స్ దందా చేయాలని భావించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన దినేష్ కల్యాణ్ నుంచి రూ.6 వేలకు ఒక గ్రాము హెరాయిన్ చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో గ్రాము రూ.12 వేలకు విక్రయిస్తున్నారు.
Police Caught Drugs in Hyderabad: ఇటీవల మహదేవ్ రాజస్థాన్ వెళ్లి 30 గ్రాముల హెరాయిన్‌ను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చాడు. హెరాయిన్‌ను ఒక్కో ప్యాకెట్‌లో 2 గ్రాముల చొప్పున ఉంచి అవసరమైన వారికి విక్రయించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. సరూర్‌నగర్‌లో నిందితులు హెరాయిన్ అమ్ముతుండగా పోలీసులు వారిని పట్టుకుని 34 గ్రాములు హెరాయిన్, ద్విచక్ర వాహనం, తూకం వేసే పరికరం, రెండు చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.