Driving license Suspensions in Telangana :తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులలో ఎక్కువగా మద్యం సేవించిన వారివే ఉంటున్నాయి. మందేసి వాహనం నడిపినా, అధిక లోడ్‌తో ఉన్న వాహనాలను వేగంతో నడిపే చోదకుడిపై చట్ట ప్రకారం కేసు నమోదైతే లైసెన్సును సంబంధిత రవాణా శాఖ అధికారులు సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా ఒక్క ఏడాది కాలంలో రాష్ట్రంలో 15,209 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. అందులో 85 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదైన కేసులే ఉండటం గమనార్హం.
ఈ సారి దాదాపు 10 వేలు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2022-23లో 16,649 లైసెన్సులు సస్పెండ్ చేయగా, 2023-24లో ఆ సంఖ్య ఒక్కసారిగా 7,565కు తగ్గింది. ఈ ఏడాదిలో (2024) ఇప్పటి వరకు దాదాపుగా 10 వేల లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసినట్లు తెలిసింది. చర్యలు తీసుకోవడంలో రవాణా శాఖ జాప్యం చేస్తోందని రాష్ట్ర పోలీసు శాఖ అసహనం వ్యక్తం చేయడంతో ఇటీవల ఆ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిస్తోంది. కేసులు ఎక్కడ నమోదైనా డ్రైవింగ్ లైసెన్సు పొందిన రవాణా శాఖ అధికారులకే ఈ సస్పెన్షన్ అధికారం ఉంది.
ఈ చిక్కుముడి వీడకనే సస్పెన్షన్లలో జాప్యం జరుగుతోందని పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడితే లైసెన్సును సస్పెండ్ చేసేందుకు పోలీసులు రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు.