Drinking Water Problem in Chittoor District : చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి దాదాపు పది సంవత్సరాల క్రితం కౌండిన్య నదిలో వైఎస్సార్ జలాశయం పేరుతో ఒక ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భూగర్భ జలాలు వృథా కాకుండా నీరు చెట్టు పథకం కింద చెక్ డ్యాములు నిర్మించి వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంది.
సొంతింటి కలల్ని కూల్చేసిన జగన్- అయిదేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం
తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ జలాశయం నుంచి పలమనేరు ప్రజలకు తాగునీరు అందించేవారు. తరువాత అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం రావడంతో స్థానిక నాయకులు ఇసుక స్మగ్లర్లుగా అవతారమెత్తారు. రాత్రి పగలు తేడా లేకుండా కౌండిన్య నదిలో తాగునీటి పంపు హౌస్ చుట్టూ ఉన్న ఇసుకను జేసీబీలతో తోడేసి సొమ్ము చేసుకున్నారు. మట్టిని కూడా ఫిల్టర్ చేసి అమ్ముకున్నారు. వారి అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేయలేక పోయారు.
Illegal sand mining in Palamaner :గత మూడేళ్లుగా అడపాదడపా కురిసిన వర్షాల వల్ల మున్సిపాలిటీ ప్రజలు గొంతు తడుపుకొన్నారు. కానీ ఇప్పుడు వేసవి కాలం మొదలైంది. వేసవి ప్రారంభం నుంచే పలమనేరు ప్రజలకు సైతం తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పట్టణ ప్రజలకు తాగడానికి నీరు అందించే పరిస్థితిలో మున్సిపాలిటీ లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి వచ్చే కుళాయి నీటి కోసం కాలనీ వాసులు మెుత్తం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వర్షపు నీరు నిల్వ ఉంచడానికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క చెక్ డ్యామ్ నిర్మాణం కూడా చేపట్టకపోవడంతో వర్షపు నీరు మొత్తం తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోతోంది. పలమనేరులో తాగునీటికే దిక్కు లేకపోతే ఇక సాగునీటి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. పట్టణ ప్రజలు రోజూ నీటి ట్యాంకర్లపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అధికారంలోకి రాకముందు నియోజకవర్గంలో ఏ ఒక్కరు తాగునీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాకుండా చేస్తానని నీతులు చెప్పారు.