Mythri Movie Makers Compensation to Revathi Family: సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పుష్ప చిత్రం నిర్మాత నవీన్‌తో కలసి మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్, శ్రీతేజ్ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి నిర్మాతలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవతి భర్తను పరామర్శించి చెక్కును అందించారు.
తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమని ఇది వారి కుటుంబానికి తీరనిలోటని నిర్మాతలు అన్నారు. ప్రస్తుతం బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని వివరించారు. బాధిత కుటుంబానికి తమ వంతు సాయం చేయడానికి ఇక్కడకు వచ్చామని ఇక నుంచి వారి కుటుంబానికి అండగా నిలబడతామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు తెలిపారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు దాడిని ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సినీ హీరోలు, నిర్మాతల ఇళ్లపై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదని అన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తెలంగాణలో సినీ పరిశ్రమను ప్రోత్సహించి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వివరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్‌లు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేమమని బాలుడు శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మంత్రి కోరారు. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.