Police issues notices to Allu Arjun to appear for investigation: సినీ హీరో అల్లు అర్జున్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జన్ను పోలీసులు విచారించనున్నారు.
30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్: పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు: ఇక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని, ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత అని సీఎం వెల్లడించారు. సంధ్య థియేటర్ ఘటనపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు, షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సినీ ప్రముఖులను సీఎం హెచ్చరించారు.
అల్లు అర్జున్ మీడియా సమావేశం: ఇదిలావుంటే సంధ్య థియేటర్ ఘటనపై సీఎం వ్యాఖ్యల అనంతరం అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ తనకు గుడిలాంటిదని అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని హీరో అల్లు అర్జున్ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. తన వ్యవహారశైలిపై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఖండించారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నారు.
సంధ్య థియేటర్ ప్రమాదం దురదృష్టకరం - నా క్యారెక్టర్‌ను కించపరిచారు: అల్లు అర్జున్
'సంధ్య థియేటర్ ఘటన' - రేవతి కుటుంబానికి మైత్రీ మూవీస్ రూ.50 లక్షల పరిహారం