CM Chandrababu Discuss With IT Employees : పేదింటి కుర్రాడు కష్టాన్ని నమ్ముకొని లక్ష్మీ కటాక్షం పొందాడు. ఏడాదికి రూ. 93 లక్షలు ప్యాకేజీతో ఉద్యోగం సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఆ యువకుడు ఆశ్చర్యపరిచాడు. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో చంద్రబాబు శనివారం ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ అనే యువకుడు తాను బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని చెప్పాడు. కటింగులన్నీ పోనూ నెలకు రూ.6 లక్షలు 37 జీతం వస్తోందని తెలిపాడు. ఎంత జీతం అంటూ మరోమారు చంద్రబాబు అడగ్గా ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ అంటూ సమాధానమిచ్చారు. ఆశ్చర్యపోయిన చంద్రబాబు ఆ యువకుణ్ని చప్పట్లు కొట్టి అభినందించాలంటూ అందర్నీ కోరారు. సభకు హాజరైన వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.
మీ పుణ్యఫలంతోనే ఐటీ ఉద్యోగాలు : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రతినెలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో శనివారం పర్యటించారు. గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ముఖాముఖిలో మాట్లాడారు. మొదట ‘ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులున్నారా?’ అని ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు ప్రశ్నించగా, 40 మంది మంది యువతీ యువకులు లేచి నిలబడ్డారు. మీరంతా వేదికపైకి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం వారికి మైకిచ్చి అనుభవాలు పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "మీ పుణ్యఫలంతోనే ఐటీ ఉద్యోగాలు సాధించాం. కరోనా నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. తల్లిదండ్రులను చూసుకుంటున్నాం. ఉద్యాన పంటలు పండిస్తున్నాం. అదనపు ఆదాయం వస్తోంది" అని సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు : కొందరైతే ఐటీ ఉద్యోగంతో పాటు పొట్టేళ్ల పెంపకం చేస్తున్నామన్నారు. ‘పల్లెటూరిలో పుట్టి, మీ స్ఫూర్తితో బీటెక్ చదివాను. నెలకు రూ.2.20 లక్షల జీతం వస్తోంది’ అని మరో ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ తెలిపారు. యువత మాటలకు ముగ్ధుడైన సీఎం చంద్రబాబు మీ కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ యువతకు అత్యంత సులభతరంగా మారిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తామని తెలిపారు. నైపుణ్యం ఉంటే యువత ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితి ఉండదని, కంపెనీలే అభ్యర్థులను వెతుక్కుంటూ వస్తాయని వివరించారు. ఐటీ నైపుణ్యంతో రాయలసీమ యువత రాష్ట్రానికి వన్నె తెచ్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
కంగ్రాట్స్ పల్లవి - విజయనగరం వెయిట్ లిఫ్టర్‌ను అభినందించిన చంద్రబాబు
'వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం' - నిర్మలమ్మ బడ్జెట్‌పై చంద్రబాబు స్పందన