Divis Pharma Company Works Under Police Security: కాకినాడ జిల్లా తొండగి మండలం ఒంటిమామిడి వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమ మూడో యూనిట్ నిర్మాణంలో సముద్రంలోకి పైపులైన్లు వేసే ప్రక్రియ భారీ పోలీస్ బందోబస్త్ మధ్య చేపట్టారు. సముద్ర జలాలు వినియోగించుకునేందుకు సముద్రంలోకి కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసే ప్రక్రియ ఇవాళ చేపట్టారు. తొండంగి సముద్ర తీరంలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటును మొదటి నుంచి స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు.
గతంలో తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. దీంతో సుమారు 300 మంది పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సముద్ర జలాలు శుద్ధి చేసి ఫార్మా పరిశ్రమ అవసరాలకు వినియోగించుకోనేందుకు పైపులైను నిర్మాణం చేపడుతున్నామని దివిస్ ఫార్మా ప్రకటించింది. అయితే పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు సముద్రంలోకి వదిలితే మత్స్య సంపద చనిపోయి తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో స్థానిక మత్స్యకార నాయకులతో కలెక్టర్ షాన్మోహన్ చర్చలు జరిపారు. కలెక్టర్ తమకు న్యాయం చేస్తామని పూర్తి హామీ ఇచ్చారని, మత్స్యకార నాయకులు చెబుతున్నారు.
"మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. పరిశ్రమలు రావాలి. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి. అయితే తీర్ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు న్యాయం చేయాలి. పరిశ్రమ వస్తే మత్స్యకారులకు ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడినాము. ఆయన మాకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు". - మత్స్యకార నాయకులు
నడిసంద్రంలో మత్స్యకారులకు తోడుగా ఇస్రో పరికరం - Transponders on fishermen boats