Gold Thieves Arrested in Jammalamadugu: బంగారం తాకట్టు కోసం బ్యాంకులకు వచ్చే వారిని దోచేస్తోన్న ఇలాంటి దోచేస్తోన్న అత్తా కోడళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జమ్మలమడుగు పోలీసులు అరెస్టు చేశారు. విచారించగా. తల్లీ, కుమారుడు, కోడలిపై రాష్ట్రవ్యాప్తంగా 12 కేసులు ఉన్నట్లు తేలడంతో విస్మయానికి గురయ్యారు.
గత నెల జనవరి 30వ తేదీన జమ్మలమడుగులోని కెనరా బ్యాంకులో దొంగతనం జరిగింది. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ బంగారు వస్తువులను తాకట్టు పెట్టి రుణం పొందేందుకు వచ్చారు. తన బంగారు నగలను బ్యాగులో ఉంచి దరఖాస్తు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో ఇద్దరు మహిళలు బ్యాగును కత్తిరించి బంగారు నగలున్న సంచిని తీసుకెళ్లారు.
దీనిపై బాధితురాలు జమ్మలమడుగు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం తాడిపత్రి రోడ్డులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా వాహనంలో పారిపోయినందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. విచారించగా వారు తల్లి అనంతమ్మ, కుమారుడు మహేష్, కోడలు గాయత్రిగా గుర్తించారు. వీరంతా అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వారిగా తెలిపారు. వీరిని అరెస్టు చేసి 8 లక్షల 80 వేల రూపాయల విలువైన 11 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
"ఓ మహిళ వెనకే ఉండి, ఆవిడ బ్యాగులోని బంగారాన్ని దొంగిలించడం జరిగింది. ముందుగా సీసీ కెమెరాలలో వారిని గుర్తించి, ఆ ఫొటోలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు పంపించాము. మాకు తెలిసిన వారి ద్వారా సమాచారాన్ని సేకరించాము. వీరిది అనంతపురం జిల్లా గుత్తి అని తెలిసింది. అనంతమ్మ, కుమారుడు మహేష్, కోడలు గాయత్రి. వీళ్లకి ఇది మొదటిది ఏమీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు వీరిపై ఉన్నాయి. ఈ కేసులో వీరి ముగ్గురినీ అరెస్టు చేసి సుమారు 11 తులాల బంగారం సీజ్ చేయడం జరిగింది. వీళ్లను కోర్టులో ప్రవేశపెడతాము. అందరి బ్యాంకు అధికారులకు, కస్టమర్లకు మేము చెప్పేది ఏంటంటే బంగారం తాకట్టు పెట్టడానికి వెెళ్లేటప్పుడు మీతో పాటు మరొకరిని తీసుకుని వెళ్లండి. దీని వలన ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడొచ్చు. ఏదైనా జరిగినా వెంటనే వారిని గుర్తుపట్టి, నిందుతులను పట్టుకోవచ్చు". - వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు డీఎస్పీ
వ్యాపారి దృష్టి మళ్లించి రూ. 64 లక్షలు దోపిడీ - దొంగలు అరెస్ట్