Why Do Hindus Want To Die in Kashi : ఎవరైనా బతుకుదెరువు కోసం ఉన్న ఊరు విడిచి మరో ప్రదేశానికి వెళ్తారు. కానీ ఈ ప్రదేశంలో చనిపోతే మాత్రం బాగుండు అని కోరుకుని వెళ్లే ఏకైక ప్రదేశం కాశీ నగరం. వయసు పైబడ్డాక వృద్ధాప్యంలో కాశీలో మరణించాలి, లేదా పుత్ర సన్నిధిలో మరణించాలి- అన్నది పెద్దల మాట. ఈ రెండూ మోక్షదాయకాలని నమ్ముతుంటారు.
కాశీనగర వృత్తాంతం :పరమశివుడికి కాశీ నగరం అత్యంత ప్రీతిపాత్రమైంది. పురాణకథ ప్రకారం, కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు ఈశ్వరుడు. అలా వరాన్ని పొందిన కాశీదేవి, మహాదేవుణ్ని మూడు కోరికలు కోరింది. అందులో ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ పోవాలనేది మొదటి కోరిక, కాశీలో ఎవరెలా కాలం చేసిన వారికి ముక్తి రావాలన్నది రెండోది, అక్కడి హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి సిద్ధించాలంటూ మూడు కోరికలు కోరింది.
పరమేశ్వరుడు అలాగేనని కాశీదేవిని అనుగ్రహించాడు. అది పార్వతీదేవికి నచ్చలేదు. అప్పుడు ‘ఈశ్వరునితో మాట్లాడుతూ కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా సులభంగా ముక్తిని పొందుతారు కదా అని అడిగింది పార్వతి. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి, ‘పార్వతీ! నీకు వాస్తవం ఎంటో చూపిస్తాను, పద’ అంటూ కాశీకి నగరానికి తీసుకువెళ్లాడు.
హైదరాబాద్ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్! - IRCTC Jai Kashi Viswanath Gange
మనిషి రూపంలోకి అవతారం : ఇంతలో శివుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాదిగా జనం గంగా స్నానం చేసేందుకు కాశీకి తరలివస్తున్నారు. పరమేశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకుని ‘ఇప్పుడు మనం ఇద్దరం మనుషుల అవతారంలోకి మారుదాం! నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వితంతువులా నటించి, దుఃఖిస్తూ- పాపరహితులైనవారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు ప్రాణం వస్తుంది. పాపాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తలపగిలి చనిపోతారని చెప్పు అని పార్వతిదేవితో’ అన్నాడు.
శివుడి మాట ప్రకారం పార్వతీదేవి అలా అందరినీ అడుగుతూనే ఉంది, వేలాది మంది ప్రజలు గంగాస్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ మనిషి రూపంలో ఉన్న శివుడి శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగాస్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతారన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవరూ ఆమె భర్తను తాకి, బతికించేందుకు సాహసం చేయడం లేదు.
ఈశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం, గంగాస్నానం ఆచరించి వచ్చి, ఆ దేహాన్ని తాకింది, శివుణ్ని పునర్జీవితుణ్ణి చేసింది. అప్పుడు శివుడు ‘సులభమైన మోక్షమార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అజ్ఞానంతో, అవిశ్వాసంతో ఎలా ముక్తికి దూరమవుతున్నారో చూశావుగా పార్వతీ?!’ అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో గంగా స్నానం చేసిన వారికి మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది.
అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Holy Uttar Pradesh Package