YoungMan without Legs Doing Work in Mulugu : జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. ఉంటే అది జీవితమే కాదు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. చావు అంచుల వరకు వెళ్లి 2 కాళ్లు పోగొట్టుకున్నాడు. అదృష్టం కొద్దీ బతికి బయటపడి జీవన పోరాటం చేస్తున్నాడు. అతడి సంకల్పం ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికైనా సరే బతుకు మీద ఆశలు పుట్టించేలా చేస్తోంది. ఎన్నికష్టాలు ఎదురొచ్చినా ఎదురొడ్డి నిలవవచ్చని నిరూపిస్తోంది ఇతడి జీవితం.
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం నందమూరి కాలనీకి చెందిన ఇతను నాగరాజు. ఒకప్పుడు డీసీఎం డ్రైవర్‌గా పని చేసుకుంటూ భార్యబిడ్డలతో హాయిగా సాగింది ఇతని జీవితం. కానీ అనుకోని ప్రమాదంతో బతుకంతా ఒక్కసారిగా తల్లకిందులైంది. 2022 జనవరి 30న ఇతని జీవితంలో చీకటి రోజనే చెప్పాలి. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. హాయిగా తిరిగే నాగరాజును, ఇదిగో ఇలా దివ్యాంగుడిగా మార్చింది ఆ ప్రమాదం.
చచ్చిపోదామని ప్రయత్నించి : ప్రమాద ఘటన తర్వాత కొన్ని రోజులకు స్పృహలోకి వచ్చి వాస్తవం తెలుసుకునే సరికి నాగరాజుకి జీవితం శూన్యమనిపించింది. ఇంకెందుకీ బతుకు అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఇంకొకరి సాయం లేనిదే కనీసం మంచం మీద నుంచి లేచే పరిస్థితి వచ్చిందని కుమిలిపోయాడు. ఇక చావే శరణ్యమనుకుని చచ్చిపోదామని ప్రయత్నించాడు. కానీ తనకున్న ఇద్దరు కన్న బిడ్డలు గుర్తుకు వచ్చి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని చెబుతున్నాడు.
రెండు కాళ్లు కోల్పోయి వైకల్యం వచ్చినందుకు బాధపడ్డాడు, ఆ తరువాత బాధను పక్కన పెట్టేశాడు నాగరాజు. ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురొడ్డి నిలవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పం, ఆత్మస్ధైర్యం ముందు వైకల్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. మెల్లిగా తన భార్య లావణ్య సాయంతో కుట్టు మిషన్ పని నేర్చుకుని, అదే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి మిషన్‌కే ఓ స్విచ్‌ను బిగించి దాని సాయంతో కాళ్ల అవసరం లేకుండానే కుట్టడం మొదలు పెట్టాడు నాగరాజు.