తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలు, పెద్దలు ఏకమయ్యారు - ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ధర్నాకు దిగారు - DILAWARPUR VILLAGERS PROTEST IN NH

దిలావర్‌పూర్‌లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ నిలిపివేయాలని డిమాండ్ - జాతీయరహదారిపై రాస్తారోకో - కుటుంబసమేతంగా వందల సంఖ్యలో రహదారిపై బైఠాయించి నిరసన - స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు కనిపించట్లేదని ప్లకార్డుల ప్రదర్శన

DILAWARPUR VILLAGERS PROTEST
రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న మహిళలు, చిన్నారులు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 4:28 PM IST

Nirmal District Ethnol Factory Conflict : ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ గ్రామస్థులు తమ పోరాటం ఉధృతం చేశారు. ఇవాళ గ్రామంలోని చిన్నా, పెద్దా ఏకమయ్యారు. అంతా కలిసి ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించి ఇథనాల్​ పరిశ్రమ రద్దు చేయాలంటూ శాంతియుత నిరసన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు.

ఇథనాల్ పరిశ్రమపై తమ ఆందోళన మొదలైనప్పటి నుంచి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావు కనబడుట లేదంటు చిత్రపటాలను ప్రదర్శించారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంతవరకు తమ పోరాటం ఆగదని దిలావర్​పూర్​ ప్రజలు స్పష్టం చేశారు.

పరిశ్రమను అడ్డుకుంటాం? : దిలావర్​పూర్​లో నూతనంగా నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ గత కొన్ని నెలలుగా మండలంలోని ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంట పొలాలతో పాటు అక్కడి పర్యావరణం సైతం దెబ్బతింటుందని గ్రామస్థులు చెబుతున్నారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ వివాదంపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇటీవల కాలంలో ధర్నాలు, నిరసనలు తీవ్రతరం అయ్యాయి. తాజాగా గ్రామస్థులు ఈరోజు (నవంబర్ 26) దిలావర్​పూర్​ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. ఈ నిరసనలో ఇతర గ్రామాల ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు మహిళలు సైతం పాల్గొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

స్తంభించిన రాకపోకలు: జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసి దిలావర్​పూర్ మండలంలోని పంట పొలాలను, పర్యావరణాన్ని కాపాడాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు.

Ethanol Rice Bran Oil Company : 'పరిశ్రమ వద్దు.. మమ్మల్ని చంపొద్దు'

ABOUT THE AUTHOR

...view details