Diamonds Hunting in Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది తీరాన కొండల్లో వజ్రాల(డైమండ్స్) కోసం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో డైమండ్స్ దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం సమీపంలో కృష్ణానదికి ఇరుపక్కలా గోదావరి ప్రాంతంలో ఎత్తైన కొండలు ఉన్నాయి.
వజ్రాల కోసం వేట :నందిగామ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెట్ల గ్రామానికి 3 కి.మీ దూరంలోని ఈ కొండల్లో వజ్రాలు ఉంటాయని ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు అన్వేషిస్తున్నారు. కనీసం ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోయినా కూడా కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగే వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కొంతమంది అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు, క్యాన్లల్లో తాగడానికి నీరు తీసుకుని వస్తుంటారు.
కొండపై కొంత దూరం వరకే వాహనాలు వెళ్లటానికి వీలుంటుంది. అక్కడి నుంచి కొండపై రాళ్లల్లో, చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్లి కొండ పైభాగానికి చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెతుకులాట మొదలుపెడతారు. కొండపై దట్టంగా ఉన్న చెట్లు, రాళ్ల మధ్యకు వెళ్లి మట్టిని తవ్వి వజ్రాలు కోసం వెతుకుతారు. దీనిలో భాగంగా తమకు కనపడిన రంగురాళ్లను జాగ్రత్త చేసుకుంటారు.
వజ్రం దొరికితే పంటపండినట్లే :రంగురాళ్లు కనిపిస్తే వెంటనే వాటిని కడిగి వజ్రమా కాదా అని పరిశీలిస్తారు. ఇలా రోజుల తరబడి, గంటలు తరబడి వెతుకుతూనే ఉంటారు. గతంలో కొందరికి వజ్రాలు దొరికాయనే ప్రచారంతో భారీగా జనం వస్తున్నారు. కొంతమంది అయితే కొండపై ఉన్న చిన్న ఆలయంలోనే తమ మకాం వేస్తున్నారు. అదే విధంగా గుడిమెట్ల పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కొందరు రూమ్లు అద్దెకు తీసుకుని మరీ, వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. దేవుడి దయ ఉండి వజ్రం దొరికి, తమ జాతకం మారుతుందని పేర్కొంటున్నారు. ఇక్కడికి వజ్రాలు కొనే వ్యాపారుల ఏజెంట్లు కొంతమంది వచ్చి పోతుంటారు. ఎవరికైనా వజ్రం దొరికితే వెంటనే వ్యాపారులకు చూపించి నిర్ధారణకు వచ్చి దానిని కొనుగోలు చేస్తుంటారు.