Irrigation Projects on Godavari :రాష్ట్రం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. అయితే దిగువ ప్రాంతంలో ఉప నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది పొంగిపొర్లుతోంది. రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో నీరు లేక బోసిపోయినట్టుగానే కనిపిస్తోంది.
మహారాష్ట్ర నాసిక్‌లో పుట్టిన గోదావరి నది మొత్తం 1400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాష్ట్రంలో మాత్రం నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. కందకుర్తి నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు మీదుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరి ప్రవహిస్తుంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో గోదావరి నదిలోకి వరద ప్రవాహం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటే, మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అనుకున్న మేరకు ప్రవాహం జాడ కనబడటం లేదు.
కడెం ప్రాజెక్టుతో పాటు శ్రీపాద ఎల్లంపల్లిలో ప్రవాహం ఇప్పుడిప్పుడే వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం జలాలపై ఆధారపడ్డ మధ్యమానేరుతో పాటు దిగువ మానేరుకు ఇప్పటి వరకు ఇన్‌ఫ్లోనే ప్రారంభం కాలేదు. దిగువ మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.80 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లో 925 క్యూసెక్కులే కొనసాగుతోంది. కరీంనగర్ దిగువ మానేరు జలాశయ సామర్ధ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.215 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లో కేవలం 945 క్యూసెక్కులు మాత్రమే ఉన్నాయంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఆదిలాబాద్ జిల్లా మీదుగా వచ్చే వరద నీరు కడెం ప్రాజెక్టుకు మరింత చేరితే, అప్పుడు గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లికి వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు నామమాత్రంగానే వస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ భారీ వరద మాత్రం రావడం లేదు. దీంతో ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 21.37 టీఎంసీలకు మాత్రమే చేరింది. ఎస్సారెస్పీ 90 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరినా, గేట్లను ఇప్పట్లో ఎత్తే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల దిగువ ప్రాంతాలైన జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎస్సారెస్పీ ద్వారా వరద నీరు రావడం లేదు.
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, ఇన్ ఫ్లో 4863 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 3389 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.56 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2,433 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది.