Deputy CM Bhatti Review on Agriculture Annual Budget : రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ పథకాలు, రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలు, విత్తన అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. రానున్న సీజన్లో పంటల బీమాకు టెండర్ల ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై భట్టి విక్రమార్క చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయ అభివృద్ధికి చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే రంగాలపై ఆరా :వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్కు నిధులు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడ్డారు.