Telangana Integrated Residential Schools : రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందుకు శాసనసభ నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, 'ఇప్పటికే 20 నుంచి 22 స్కూళ్ల కోసం స్థలం సేకరించాము. దసరాలోపు రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తాం. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగా లేవు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 650 రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవు.' అని వివరించారు.
అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఈ నెల 11న శంకుస్థాన చేస్తామని ప్రకటించారు. ఏడు నెలల్లో స్కూళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఇందులో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరం ఒకటే అనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.